Shabbir Ali On KTR: హైదరాబాద్ లోని జన్వాడ ఫామ్ హౌస్ లో పార్టీ నిర్వహిస్తుండగా సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రేవ్ పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలడంతో, పోలీసులు కేసు నమోదు చేసి విచారించిన విషయం కూడా తెలిసిందే. అలాగే మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్ కాని హౌస్ లో ఈ వ్యవహారం జరగడంతో రాజ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
ఈ దాడులపై నిన్న రాత్రి మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఈ దాడుల వెనుక సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ హస్తం ఉన్నట్లు ఆరోపించారు. కేవలం తమను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక, కక్షపూరిత రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారన్నారు. కేటీఆర్ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు గుర్రుమంటున్నారు. ఫిర్యాదు అంది పోలీసులు దాడులు నిర్వహిస్తే, దానికి సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఆరోపణలు గుప్పించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. రెడ్ హ్యాండెడ్ గా బావమరిది డ్రగ్స్ కేసులో చిక్కగా, కేటీఆర్ కు ఏమి పాలుపోక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వారు ఎద్దేవా చేస్తున్నారు.
తాజాగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కేటీఆర్ డ్రగ్ టెస్టు చేయించుకోవాలని, టెస్ట్ లో నెగిటివ్ వస్తే తాము కూడా డ్రగ్స్ కు కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని భావిస్తామన్నారు. అలాగే డ్రగ్స్ మాట వినిపిస్తే చాలు, కేటీఆర్ అక్కడ ఎందుకు ప్రత్యక్షం అవుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అసలు జన్వాడ ఫాంహౌస్‌కు విదేశీ మద్యం ఎలా వచ్చింది? ఎవరు సరఫరా చేశారో దర్యాప్తు అనంతరం పోలీసులు ప్రకటించాలన్నారు. కేటీఆర్ బావమరిది పేకాట ఆడుతూ.. డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికిపోయాడని ఆరోపించారు.
కేసీఆర్ కుటుంబానికి వేల కోట్లు ఎలా వచ్చాయో ప్రజలకు తెలపాలని, ప్రభుత్వం కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలని కోరారు. జన్వాడ ఫాంహౌస్‌పై వాస్తవాలు చూపించినందుకు.. సీఎం రేవంత్ అంతా చేశారు అంటున్నారు.. అసలు అక్కడ చేసింది మీ కుటుంబసభ్యులు.. ఆరోపణలు మాకా అంటూ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిని కక్షపూరితమైన ధోరణితో 40 రోజులు జైల్లో పెట్టారని, జైల్లోనే రేవంత్ ను చంపాలని ప్రయత్నించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతివారం రాజ్ పాకాల రేవ్‌పార్టీ నిర్వహిస్తున్నారన్న, పక్కా సమాచారంతోనే పోలీసులు దాడులు చేశారన్నారు. త్వరలో వాస్తవాలను ప్రజలు ముందు పెడతామన్నారు. ఏదిఏమైనా ప్రస్తుత సీఎం రేవంత్ ను చంపాలని చూశారంటూ షబ్బీర్ అలీ చేసిన ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారింది.