శంషాబాద్‌లో జరిగిన మహిళ హత్య కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. మృతురాలిని శంషాబాద్ మండలం రాల్లగూడకు చెందిన మంజులగా గుర్తించారు. ఆమె కడుపునొప్పిగా ఉందని భర్తకు చెప్పి ఈ నెల 10న శంషాబాద్ ఆస్పత్రికి వెళ్లారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను చెప్పిన వివరాలు, ఘటనాస్థలి వద్ద మృతదేహంతో సరిపోలాయి. దీంతో హత్యకు గురైన మహిళను మంజులగా పోలీసులు తేల్చారు.
మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మంజుల చివరగా ఎవరికి ఫోన్ చేశారో తెలుసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎస్వోటీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
శంషాబాద్‌లోని శ్రీనివాస ఎన్‌క్లేవ్ సమీపంలో మహిళను దుండగులు తగులబెట్టారు. మంజుల ఆ ప్రదేశానికి ఎందుకు వెళ్లారు? నిందితులు ఆమెను అక్కడకు ఎందుకు తీసుకెళ్లారు ? హత్యకు కారణాలేంటి? ఈ కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
శంషాబాద్ లో జరిగిన ఈ హత్య సంచలనం సృష్టించింది. హైదరాబాద్ లో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల జవహర్ నగర్ లో యువతిని ఓ ఉన్మాది వివస్త్రను చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది. కొన్ని రోజుల వ్యవధిలో మరో మహిళ దారుణహత్యకు గురికావడం నగరంలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తమవుతోంది.