
YS Sharmila Latest News(Telangana Political Updates) : హైదరాబాద్ పోలీసులకు, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలకు మరోసారి వాగ్వాదం జరిగింది. ఆమె కొత్త సచివాలయం ముట్టడికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. లోటస్ పాండ్ వద్ద ఆమె కారును పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో షర్మిల పోలీసులతో వాదనకు దిగారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రోడ్డుపైనే బైఠాయించారు.
రోడ్డుపైనే కూర్చుని నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. దీంతో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా పోలీసుపై షర్మిల చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
షర్మిల దాడిని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆమె తీరుపై మండిపడుతున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై దాడి చేయడంతో ఐపీసీ 353, 330 సెక్షన్ల కింద షర్మిలపై కేసు నమోదు చేశారు.
తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. తనని బయటకు వెళ్లనివ్వరా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని పోలీసులు కేసీఆర్ కోసమే పనిచేస్తున్నారని షర్మిల ఆరోపించారు.
షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమె తల్లి విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లారు. పీఎస్‌లోకి అనుమతించకపోవడంతో వాగ్వాదానికి దిగి.. ఓ మహిళా కానిస్టేబుల్‌పై విజయమ్మ చేయిచేసుకున్నారు. నిరుద్యోగుల కోసం షర్మిల పోరాడుతోందని.. ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారని నిలదీశారు. పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించి అక్కడి నుంచి వెనక్కి పంపారు.
