Telangana News : అసలే ఆడ లేడీస్. ఆఫర్ అంటే వదులుతారా. అందులోనూ డిస్కౌంట్‌లో చీరలు ఇస్తామంటే ఎగబడిపోరూ. ఆషాఢం సేల్స్‌లో షాపింగ్ మాల్స్ అన్నీ మహిళలతో కిక్కిరిసిపోతుంటాయి. ఏ 30%.. 60% తగ్గింపు అంటేనే అంతలా ఎగబడే మహిళలు.. ఇక కేవలం 9 రూపాయలకే చీర ఇస్తామంటే ఊరుకుంటారా? ఎగబడి దిగబడి ఆగమాగం చేయరూ. తిండీనిద్రలు మానేసి ఆ షాప్ ముందు పడిగాపులు పడరూ. ఎన్ని వందల మంది వచ్చినా.. తమకో చీర కోసం ఉడుంపట్టు పట్టరూ. అదే జరిగింది తెలంగాణలో. 9 రూపాయలకే చీర ఇస్తామంటూ వికారాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్ ప్రచారం చేయడంతో రచ్చ రచ్చ జరిగింది. ఓపెనింగ్‌కు యాంకర్ అనసూయ కూడా రావడంతో పరిస్థితి అదుపు తప్పింది.
రూ.9కే చీర.. బంపర్ ఐడియా
వికారాబాద్‌తో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో ఆటోలతో విస్తృత ప్రచారం చేసింది ఆ షాపింగ్ మాల్. టీవీల్లో, పేపర్లలో లక్షలు పోసి యాడ్స్ ఇచ్చినా అంతగా యూజ్ ఉండదని అనుకుందో ఏమో.. ఇలా సరికొత్తగా ఆలోచించింది. 9 రూపాయలకే చీర ఇస్తామని పబ్లిసిటీ చేయడంతో.. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఆ ఏరియాలోని మహిళలు అందరికీ తెలిసిపోయింది. వాట్సాప్ గ్రూపుల్లో ఫుల్ షేరింగ్స్. ఫోన్లు చేసుకుని మరీ మేము వస్తాం.. నువ్వూ రా అంటూ ముందే ప్లానింగ్ కూడా చేసుకున్నారు చాలామంది.
ఫ్రీ బస్ ఎక్కొచ్చి.. మాల్ ముందు మకాం వేసి..
ఆ రోజు రానే వచ్చింది. ఉదయం కల్లా వికారాబాద్‌లోని ఆ షాపింగ్ మాల్ ముందు మహిళలు క్యూ కట్టారు. అప్పటికింకా మాల్ ఓపెన్ కూడా చేయలేదు. అసలే ఫ్రీ బస్ సౌకర్యం. ఇంకేం.. అనేక గ్రామాల నుంచి వందలాదిగా మహిళలు తరలివచ్చారు. 9 రూపాయల చీర కోసం గుమ్మికూడారు. బారికేడ్లు పెట్టి మహిళలను కంట్రోల్ చేయాల్సి వచ్చింది. అదే టైమ్‌లో ముఖ్యఅతిధిగా టీవీ యాంకర్ అనసూయ వచ్చారు. ఇంకేం ఆమెను చూడటానికి జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. షాపింగ్ మాల్ ముందు భారీ ట్రాఫిక్ జామ్ జరిగింది.
చీర కొన్నాకే.. తగ్గేదేలే…
రద్దీ ఎక్కువగా ఉండటంతో మహిళల క్యూ భారీగా మారింది. గంటల తరబడి క్యూ లైన్లలో పడిగాపులు పడ్డారు. తిండీతిప్పలు లేకుండా ఓపిగ్గా వేచి ఉన్నారు. తమ వంతు ఎప్పుడొస్తుందా? 9 రూపాయల చీర ఎప్పుడు దక్కుతుందా? అని ఆశ పడ్డారు. పుసుక్కున స్టాక్ అయిపోతే? చీరలన్నీ అమ్ముడుపోతే? మాకు చీర దొరకదా? ఏం చేద్దాం? షార్ట్‌కట్‌లో లోపలికి వెళ్లే ఛాన్స్ ఉందా? ఎవరైనా తెలిసిన వాళ్లు ఉన్నారా? అంటూ ఎవరి ప్రయత్నం వాళ్లు చేయసాగారు. ఎంత లేటైనా.. ఎంత కష్టమైనా.. చీర కొన్నాకే ఇంటికి పోతామని పట్టుబట్టి అక్కడే ఉన్నారు చాలామంది మహిళలు. అసలే చీరల మేటర్ కదా.. అట్లుంటది మరి మహిళలతోని. నో కాంప్రమైజ్. తగ్గేదేలే.
చీప్ పబ్లిసిటీస్.. వేలం వెర్రి
ఇటీవల ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్స్ ఎక్కువవుతున్నాయి. అప్పట్లో ఒక్క రూపాయికే చికెన్ బిర్యానీ అంటూ బంపరాఫర్ పెట్టింది ఓ రెస్టారెంట్. వేలాదిగా జనం ఎగబడటంతో కొన్ని గంటల్లోనే చేతులెత్తేసింది. అప్పటికే కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది. ఆ రోజుకైతే ఓకే. మర్నాడు జనం వచ్చారా? అంటే అంత సీన్ లేదు. టేస్ట్ ఉంటేనే ఎవరైనా మళ్లీ మళ్లీ వచ్చేది. షాపింగ్ మాల్స్ కూడా అంతే. ఓపెనింగ్ ఆఫర్స్ వరకు జనం బానే వస్తారు. ఆ ఆఫర్ అయిపోయాక కూడా వస్తారా? లేదా? అనేదే ఇంపార్టెంట్.