Sri Rama Navami In Tirumala: ఏప్రిల్ 6న దేశ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం రామాలయాలు, హనుమాన్ ఆలయాలు ముస్తాబు అవుతున్నాయి. యూపీలోని అయోధ్యలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు యోగీ సర్కారు సిద్ధం అవుతోంది. అటు తెలంగాణలో భద్రాచలంలోనూ ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఏపీలోని ఒంటిమిట్టలోనూ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తిరుమలలో శ్రీరామనవమి ప్రత్యేక వేడుకలు
ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. 6వ తేదీన మొదలయ్యే ఈ వేడుకలు 7వ తేదీ సాయంత్రం వరకు కొనసాగనున్నట్లు తెలిపింది. ఇంతకీ ఆ కార్యక్రమాలు ఏవంటే..
⦿ ఏప్రిల్ 6న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు తిరుమంజనం నిర్వహిస్తారు.
⦿ తిరుమంజన సేవలో భాగంగా రంగనాయక మండపంలో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అర్చకులు వేదమంత్రాల మధ్య అభిషేకం చేస్తారు.
⦿ అదే రోజు సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ నిర్వహిస్తారు. ఆ తర్వాత రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు బంగారు వాకిలి చెంత శ్రీ రామనవమి ఆస్థానాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
⦿ మరుసటి రోజు అంటే.. ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుక రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు బంగారువాకిలిలో ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషే వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
Read Also: తిరుమల వెళ్తున్నారా..? మెట్ల మార్గంలో దర్శనానికి వెళితే ఈ తప్పు అసలు చేయకండి
శ్రీరామనవమి సందర్భంగా భారీగా ఏర్పాట్లు
శ్రీరామనవమి సందర్భంగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని మళ్లీ అలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుమలలో శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఆలయ ఈవో శ్యామల రావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Read Also: ఐదుగురు భర్తలున్నా ద్రౌపదిని పతివ్రతా అని ఎందుకంటారో తెలుసా..? అసలు మార్కండేయ పురాణం ఎం చెప్తుందంటే?
Read Also: శ్రీరామనవమి ఎప్పుడు ? ఈ ముహూర్తంలో పనులు చేపడితే అన్నీ మంచి ఫలితాలే