పాత వార్తే. అందరికీ తెలసినది కూడా. అప్పుడప్పుడు చర్చకు వచ్చిపోయేదే. కాంగ్రెస్‌కు రాజకీయ అస్త్రం కూడా. ఇప్పుడు మళ్లీ ఈ టాపిక్ ఎందుకొచ్చిదంటారా? మొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మీడియా ముందు ఓపెన్‌గా ఈ రెండు పార్టీల కలయికపై మాట్లాడారు. అవును.. బీఆరెస్, బీజేపీ కలిస్తే తప్పేముంది? కలిసే చాన్స్ ఉంది… అని కుండబద్దలు కొట్టేశారు. ఇది బీజేపీ స్టేట్ పార్టీలో చర్చకు తెరలేపింది. అటు రాకేశ్‌రెడ్డిపైనా ఆ పార్టీ సోషల్ మీడియా దాడికి దిగింది.
ఎందుకంత అత్యుత్సాహమంటూ చురకలంటించింది. అధిష్టానం కూడా దీనిని సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. ఇకపై ఎవరూ ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడవద్దని చెప్పడంతో పాటు తమ పార్టీ రాజకీయ వ్యూహంపై మరోసారి లీడర్లకు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. మోడీ ఇది వరకు చాలా సార్లు బీఆరెస్‌పై అంతర్గత చర్చల్లో చేసిన కామెంట్ గురించి అధిష్టానం గుర్తు చేసినట్టు తెలిసింది.
బీఆరెస్ పని ఖతమైంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం వేస్ట్.. అధికార పార్టీపైనే మనం గురి పెట్టాలి.. రాష్ట్రంలో పార్టీ ఎదగడానికి ప్రయత్నం చేయడంతో పాటు ఒంటరిగా అధికారంలోకి తీసుకువచ్చే విధంగా పనిచేయాలి.. అని కేంద్ర పెద్దలు చెప్పిన హితోక్తులను ఈ సందర్బంగా రాష్ట్ర కాషాయదళానికి మళ్లీ నూరిపోశారట. దీంతో ఎక్కడివారక్కడ సైలెంట్ అయిపోయారు.
దీనిపై ఓ లీడర్ మాట్లాడుతూ.. నిజమే కదా.. ఇప్పట్నుంచి పొత్తులు, ఆ పార్టీ విలీనం పై మాట్లాడుకుంటే నష్టం బీజేపీకే.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి ఒంటరిగా పోటీ చేసి గెలిచేలా చేయాలె.. గానీ బీఆరెస్ జోలికి పోతే.. పార్టీని ప్రస్తుత పరిస్తితి కంటే మరింత దిగజార్చుకున్నట్టే.. అని కామెంట్ చేశారు. మరి బీఆరెస్ పదేళ్ల పాలనపై, అవినీతి, అక్రమాలపై బీజేపీ పెద్దలు పల్లెత్తు మాట్లాడకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు కదా..? అనే ప్రశ్నకు… ఆ పార్టీని ప్రజలు చీకొట్టి రెండేళ్లయింది. ఇంకా కేసీఆర్ పాలన, అవినీతి అని మాట్లాడితే జనం కూడా హర్షించరు. అధికార పార్టీని టార్గెట్ చేయాలె.. ఇచ్చిన హామీలు, ప్రజల వ్యతిరేకత.. ఇవన్నీ అస్త్రాలుగా వాడుకుని సందర్భోచితంగా ఉద్యమాలు నిర్మించాలె. ఒంటరిగా ఎదిగాలె.. అని సమాధానమిచ్చారాయన.
కానీ, బీజేపీ ఎంత కవరింగు చేసుకున్నా.. బీఆరెస్ ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా.. ఈ రెండు భవిష్యత్తు రాజకీయాల్లో ఒక్కటిగా కలవనున్నాయని చాలా సందర్బాల్లో ఆ రెండు పార్టీలు చెప్పకనే చెప్పాయి. ఆ ఉదంతాలు, ఉదాహరణలు ప్రజల మదిలో ఇంకా మెదులుతున్నాయి.