High Blood Pressure: అధిక రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్ అనేది ఈ రోజుల్లో చాలా మందిని ప్రభావితం చేస్తున్న ఒక సాధారణ సమస్య. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. మందులతో పాటు, మన జీవనశైలిలో కొన్ని సాధారణ మార్పులు చేసుకోవడం ద్వారా రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆహారంలో ఉప్పును తగ్గించండి:
ఉప్పు నియంత్రణ: అధిక ఉప్పు తీసుకోవడం రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణం. రోజుకు 1,500 మిల్లీగ్రాముల (సుమారు ఒక టీస్పూన్) కంటే తక్కువ ఉప్పును తీసుకోవడం మంచిది.
ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరం: ప్యాక్ చేసిన చిప్స్, పచ్చళ్లు, సాస్‌లు, సిద్ధంగా ఉండే ఆహారాలలో ఉప్పు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని తగ్గించి.. ఇంట్లో తయారుచేసిన తాజా ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
2. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి:
రోజువారీ నడక: రోజుకు కనీసం 30 నిమిషాలు వేగంగా నడవడం, జాగింగ్ లేదా సైక్లింగ్ వంటి మితమైన ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తనాళాలపై ఒత్తిడి తగ్గి రక్తపోటు అదుపులోకి వస్తుంది.
గుండెను బలోపేతం: క్రమం తప్పని వ్యాయామం గుండెను బలోపేతం చేసి.. తక్కువ శ్రమతో రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయడానికి సహాయపడుతుంది. ఫలితంగా గుండె పనితీరు కూడా మెరుడుపడుతుంది.
3. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి:
పొటాషియం పెంచండి: పొటాషియం ఉప్పు (సోడియం) ప్రభావాన్ని తగ్గిస్తుంది. అరటిపండ్లు, ఆకుకూరలు, టమాటోలు, బంగాళదుంపలు, చిక్కుళ్ళు, పెరుగులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.
DASH డైట్: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు , తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు అధికంగా ఉండే DASH డైట్‌ను అనుసరించడం వల్ల రక్తపోటును గణనీయంగా తగ్గించవచ్చు. ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
4. బరువును నియంత్రించండి:
బరువు తగ్గడం: అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి రక్త పోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. బరువు తగ్గడం అనేది రక్తపోటును నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొద్దిగా బరువు తగ్గినా కూడా రక్తపోటు తగ్గే అవకాశం ఉంది.
నడుము కొలత: పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి కూడా రిస్క్ ఎక్కువ. కాబట్టి.. ఆరోగ్యకరమైన బరువును లక్ష్యంగా పెట్టుకోండి.
5. ఒత్తిడిని నిర్వహించండి:
ధ్యానం/యోగా: దీర్ఘకాలిక ఒత్తిడి రక్త పోటును పెంచుతుంది. యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు వంటివి ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను పెంచడానికి సహాయపడతాయి.
నిద్ర: ప్రతి రోజు రాత్రి కనీసం 7-8 గంటలు నాణ్యమైన నిద్ర పోవడం చాలా ముఖ్యం. తగినంత నిద్ర లేకపోవడం కూడా రక్తపోటు పెరగడానికి ఒక కారణం కావచ్చు.
6. ధూమపానం, మద్యం మానేయడం:
పొగ మానేయండి: ధూమపానం రక్త నాళాలను గట్టి పరుస్తుంది. సిగరెట్ తాగిన తర్వాత రక్త పోటును తాత్కాలికంగా పెంచుతుంది. పొగ తాగడం పూర్తిగా మానేయాలి.
మద్యం: అధికంగా మద్యం సేవించడం కూడా రక్త పోటును పెంచుతుంది. మద్యపానాన్ని పరిమితం చేయడం లేదా పూర్తిగా మానేయడం మంచిది.