Sonia Gandhi Telangana Tour: రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీ వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యల కారణంగా సోనియా గాంధీ రాలేకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మే 28న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీని వేడుకలకు రావాలని ఆహ్వానించారు.
ఏఐసీసీ సోనియా గాంధీ ఆవిర్భావ వేడుకలకు హాజరవుతారని తెలిపింది. అంతలోనే వేడుకలకు సోనియా రావడం లేదంటూ కాంగ్రెస్ వర్గాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్ర వేడుకలకు విద్యావేత్తలు, ఉద్యమకారులతో పాటు వివిధ వర్గాల వారికి ఆహ్వానం అందించారు. జూన్ 2న జరిగే ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఈ నేపథ్యంలోనే చార్మినార్, ట్యాంక్ బండ్, సచివాలయం, అమర జ్యోతి స్థూపం, గోల్కొండ తో పాటు వివిధ పర్యాటక ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమై భద్రతా ఏర్పాట్లను చేయగా.. సీఎస్ శాంత కుమారి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్.. దశాబ్ది వేడుకలకు ఆహ్వానం
తెలంగాణ ఆవిర్బావ వేడుకల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్యాంక్ బండ్,సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీంతో శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం అర్థరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.