Nagarjuna Sagar: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని జ్యోతిరావు పూలే BC గురుకుల పాఠశాల విద్యార్థులు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నాలుగు రోజుల కిందట బోర్ మోటర్ పాడయ్యింది. నీళ్లు రావడం లేవని సిబ్బందికి చెప్పినా పట్టించుకోకపోవడంతో… విద్యార్థులు బయట నుంచి నీళ్లు తెచ్చుకొని స్నానాలకు ఉపయోగించుకుంటున్నారు. మరికొందరు బయటకు వెళ్లి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బోర్ గురించి ప్రిన్సిపాల్‌కు చెబితే పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు. గట్టిగా మాట్లాడితే వేరే గురుకుల పాఠశాలకు బదిలీ చేస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఇది వారిలో భయాందోళనలను రేకెత్తిస్తోంది.
ఈ పాఠశాలలో సామాజిక తనిఖీల సందర్భంగా గుర్తించిన ఇతర సమస్యలలో, 52 మరుగుదొడ్లలో 13 నిరుపయోగంగా ఉన్నాయని, 39 మరుగుదొడ్లకు సరైన నీటి సౌకర్యం లేదని తేలింది. అయితే తలుపులు లేని మరుగుదొడ్లు విద్యార్థులకు మరింత అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాగే, తరగతి గదులు, ఆటస్థలం, డార్మిటరీలు సరిపడా లేని పరిస్థితుల్లో ఉన్నాయి.
పాఠశాలలో 22 మంది ఉపాధ్యాయులు ఉండగా, తనిఖీ సమయంలో ఒకరు బాధ్యతయుతంగా లేడని అధికారులు గుర్తించారు. ఆరవ తరగతికి సంబంధించి విద్యార్థులు లేనప్పటికీ, ఐదుగురు విద్యార్థుల పేర్లతో హాజరు నమోదు చేయడం వంటివి కూడా బయటపడ్డాయి.
అయితే ప్రస్తుత ప్రిన్సిపాల్ సత్యనారాయణ, తాను కొత్తగా బదిలీ అయ్యానని, త్వరలో సమస్యలను సరిదిద్దుతానని చెప్పినప్పటికీ, విద్యార్థులు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి విద్యార్థుల విద్యా ప్రగతిని, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని చెబుతున్నారు.
Also Read: వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. పసిడి ప్రియులకు ఇక పండగే..
అంతేకాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకొని, నీటి సౌకర్యాలను మెరుగుపరచడం, బోర్‌వెల్‌ను రిపేర్ చేయడం, మరుగుదొడ్ల సమస్యను పరిష్కరించడం చాలా అవసరం. లేదంటే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే విద్యార్థుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, పాఠశాల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారించాలని తెలిపారు.