AP National Highways: నేషనల్ హైవే రేసులో ఏపీ ఇప్పుడు స్పీడ్ గేర్‌లోకి వెళ్లిపోయింది. కొత్త ప్రాజెక్టుల జాబితా చూస్తేనే అబ్బో అనిపిస్తుంది. రోడ్ల విస్తరణ, గ్రీన్‌ఫీల్డ్ కారిడార్లు, పోర్ట్ కనెక్టివిటీ హైవేలు ఇవన్నీ ఇప్పుడు కలిసి వచ్చే అంశం. ఇవి పూర్తయితే నగరాల మధ్య జర్నీ టైమ్ అర్ధానికి తగ్గిపోనుంది. రైతుల సరుకు, పరిశ్రమల ఉత్పత్తులు, పర్యాటకులు.. ఎవరికైనా ఈ రోడ్లపై జర్నీ వేరే లెవెల్‌గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏపీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. అదేమిటో తెలుసుకోవాలంటే, ఈ కథనం చదవండి.
అసలు విషయం ఇదే!
ఏపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హైవే నెట్‌వర్క్‌లో సత్తా చూపుతోంది. జూన్ 30, 2025 నాటికి ఏపీకి 8,683 కిలోమీటర్ల జాతీయ రహదారి నెట్‌వర్క్ రాష్ట్రంలో ఉంది. రహదారుల ఈ విస్తరణ రాష్ట్రానికి గర్వకారణం మాత్రమే కాదు, రాబోయే కాలంలో ఆర్థిక, సామాజిక రంగాలపై విప్లవాత్మక ప్రభావం చూపనుంది. మిగతా రాష్ట్రాలను పక్కన పెట్టినా, ఏపీ రహదారుల ఆభివృద్ధి వేగంను ఇప్పుడు దేశం మొత్తం గమనిస్తోంది.
ప్రస్తుతం ఏపీలో కొత్తగా జరుగుతున్న ముఖ్యమైన ప్రాజెక్టుల్లో విశాఖపట్నం – శ్రీకాకుళం, రాజమహేంద్రవరం – ఏలూరు NH-16 అప్‌గ్రేడ్ పనులు ఉన్నాయి. ఇవి 4-లేన్ నుంచి 6-లేన్ వరకు విస్తరిస్తుండటంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. NH-216 తీరప్రాంత రహదారి కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు వంటి ప్రధాన తీర పట్టణాలను కలుపుతూ పెద్ద మార్పు తీసుకువస్తోంది.
ప్రస్తుత ప్రాజెక్ట్స్ ఇవే!
అనంతపురం – అమరావతి గ్రీన్‌ఫీల్డ్ కారిడార్లో కొంత భాగం పనులు పూర్తి కావస్తుండగా, మరికొన్ని ప్యాకేజీలు ఎర్త్‌వర్క్ దశలో ఉన్నాయి. తిరుపతి – రేణిగుంట ప్రాంతాల్లో NH-716, NH-716G బైపాస్ పనులు దాదాపు పూర్తి దశలో ఉండగా, కర్నూలు – చిత్తూరు NH-40 బలోపేత పనులు వేగంగా జరుగుతున్నాయి. పోర్ట్ కనెక్టివిటీ కోసం గంగవరాం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను జాతీయ రహదారులతో కలుపుతున్న ప్రత్యేక మార్గాలు నిర్మాణ దశలో ఉన్నాయి.
రాయపూర్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తర ఏపీ జిల్లాలకు పెద్ద ఊతమిస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నం నుంచి మధ్యప్రదేశ్ వరకు సరుకు రవాణా సమయం తగ్గుతుంది. ఇదే విధంగా తూర్పు తీర కారిడార్ అయిన NH-216 పూర్తి స్థాయిలో సిద్ధమైతే, తీరప్రాంతంలో పర్యాటకానికి గోల్డెన్ హైవేలా మారుతుంది.
ఇవే పూర్తయితే ఏంటి లాభం?
ఈ హైవే ప్రాజెక్టులు పూర్తయితే ఏపీకి అనేక లాభాలు ఉంటాయి. మొదటిగా, రవాణా ఖర్చులు తగ్గి, సరుకు రవాణా వేగం పెరుగుతుంది. రాష్ట్రంలోని పోర్టులు, పరిశ్రమలు, వ్యవసాయ మార్కెట్లకు రవాణా సులభతరం అవుతుంది. పంటలు, పండ్లు, సముద్ర ఆహారం వంటి ఉత్పత్తులు వేగంగా రవాణా అవ్వడంతో రైతులకు అధిక లాభాలు వస్తాయి.
రెండవది, పర్యాటక రంగం భారీ స్థాయిలో పెరుగుతుంది. విశాఖపట్నం బీచ్‌లు, అరకు, శ్రీశైలం, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు రహదారి సౌకర్యాలతో మరింత ఆకర్షణీయంగా మారతాయి. మూడవది, ఇండస్ట్రియల్ కారిడార్లు, MSMEs, ఐటీ పార్కులు రహదారి సదుపాయాలతో పెరుగుదల దిశగా దూసుకెళ్తాయి.
ఇంకా ముఖ్యంగా, ఎక్స్‌ప్రెస్ హైవేలు, పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పూర్తయితే, ఏపీ దేశవ్యాప్తంగా ఒక ప్రధాన లాజిస్టిక్స్ హబ్‌గా అవతరిస్తుంది. రోడ్డు ప్రయాణంలో సమయం తగ్గడం వల్ల వ్యాపారాలకే కాదు, సాధారణ ప్రజలకు కూడా పెద్ద సౌలభ్యం కలుగుతుంది. నగరాల్లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించడానికి కొత్త బైపాస్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు ఏర్పడతాయి. FASTag 2.0, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అమలులోకి వస్తే ప్రయాణం మరింత సులభమవుతుంది.
దేశంలో టాప్ 10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర 18,462 కిమీతో అగ్రస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ (12,123 కిమీ), రాజస్థాన్ (10,733 కిమీ), మధ్యప్రదేశ్ (9,263 కిమీ) వంటి రాష్ట్రాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కానీ ఏపీ 8,683 కిమీతో టాప్ లిస్టులో 5వ స్థానంలో నిలవడం ప్రత్యేక గర్వకారణం. భవిష్యత్తులో ఈ హైవే ప్రాజెక్టులు పూర్తి అయితే ఏపీ ఆర్థిక వృద్ధి రేటు మరింత పెరుగుతుంది. ఏపీ రోడ్లు కేవలం రహదారులు కాదు, అవి రాష్ట్ర భవిష్యత్తుకు గోల్డెన్ లైన్స్ అని చెప్పుకోవచ్చు.