Weather Update: నిన్నటి వరకు రాత్రి వేళ చలిగాలులు కాస్త వీచాయి. దీనితో ప్రజలకు వేడిగాలుల నుండి ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. అయితే రానున్న రోజుల్లో మాత్రం వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుందని హైదరాబాద్ కు చెందిన వాతావరణ అంచనా నిపుణులు బాలాజీ ట్వీట్ చేశారు. ఇంతకు బాలాజీ ఏం చెప్పారంటే..
గత మూడు రోజులుగా హైదరాబాద్ నగరవాసులకు వేడి గాలుల నుండి కాస్త ఉపశమనం లభించింది. ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు కాస్త సమ్మర్ సీజన్ ఎఫెక్ట్ అంతగా లేదనే చెప్పవచ్చు. ప్రధానంగా హైదరాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఎండలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీనితో వృద్దులు, చిన్నారులకు వేడిగాలుల నుండి ఉపశమనం లభించింది. రాత్రి వేళ చలిగాలులు వీయడంతో చల్లని నిద్ర నగరవాసులకు పట్టింది. కానీ ఇక నుండి భానుడు తన ప్రతాపం చూపే రోజులు మళ్లీ వచ్చాయని బాలాజీ తెలిపారు.
అయితే తెలంగాణలోని పలు జిల్లాలలో ఎండ ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ, మరికొన్ని జిల్లాలలో ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉందట. మార్చి 12 నుండి మాత్రం ఎండ అధికమై, వేడిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని బాలాజీ సూచించారు. అలాగే తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు కూడా ఎండలపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రధానంగా 12 వ తేదీ నుండి భానుడి భగభగలు అధికం కానుండగా, వృద్దులు, చిన్నారులు ఎండల సమయంలో బయటకు రాకుండా ఉండడమే శ్రేయస్కరమన్నారు. ఉదయం, సాయంత్రం తమ పనులు చక్కబెట్టుకొనేలా చూడాలని వారు సూచించారు.
ఇక ఏపీలో శనివారం పార్వతీపురంమన్యం సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. 82 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపడం విశేషం. ఈ వాతావరణ పరిస్థితులపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ముందుగానే హెచ్చరించారు. కాగా ఏపీలో ఎండ ప్రభావం అధికమయ్యే అవకాశాలు అధికమయ్యే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో సమ్మర్ ఎఫెక్ట్ కనిపిస్తుండగా, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఎండల వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
నల్లని రంగు టోపీ ధరించకుండా ఉండడం ఉత్తమం
ఎండలో బయటకు వెళ్లేవారు గొడుగు ధరించాలి
ఉదయం, సాయంత్రం వేళనే పనులు చక్కబెట్టుకోవాలి
వడదెబ్బ లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి
తప్పక త్రాగునీటి డబ్బాను కలిగి ఉండడం మంచిది
వేడిగాలులు వీచే సమయంలో చెట్ల నీడన ఉండడం ఉత్తమం
జంక్ ఫుడ్ కు దూరంగా ఉండడం శ్రేయస్కరం
మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను తీసుకోవడం మంచిది
వృద్దులు, చిన్నారులు ఎండలలో బయటకు రాకుండా ఉండాలి
కళ్లు తిరగడం లక్షణాలు ఉంటే డాక్టర్ ను సంప్రదించాలి
వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి
రానున్న ఎండలు భయపెట్టే రీతిలో ఉండవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సమ్మర్ కంటే ముందే ఎండలు విపరీతమయ్యాయని, ఇప్పుడు సమ్మర్ సీజన్ రావడంతో రానున్నది మండే కాలమే అంటున్నారు ప్రజలు. ఏపీ కంటే తెలంగాణలో మండే ఎండలు అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎండలలో బయటికి వెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!