Khammam Politics: స్వేఛ్చ బ్యూరో: తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు ఆ పార్టీ బీ ఫారాలు ఇవ్వలేదు. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న పలుకుబడిని బట్టి ఎన్నికల బరిలోకి దిగిన టిడిపి నాయకులకు పార్టీ అధిష్టానం బీ – ఫారాలను కేటాయించలేదు. స్థానికంగా పార్టీల మధ్య కుదుర్చుకున్న ఒడంబడిక మేరకే పొత్తులు పెట్టు కున్నారు. ప్రధానంగా కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐతో మధిరలో కాంగ్రెస్ పార్టీతో పెట్టు కున్న పొత్తుల్లో కూడా టిడిపి అభ్యర్థిగా పార్టీ బి -ఫామ్ అందజేయలేదు. కొత్తగూడెంలో సిపిఐ బి -ఫామ్‌తో, మధిరలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. కొత్తగూడెం లోని 60 డివిజన్లలో 354 మంది అభ్యర్థులు వివిధ పార్టీల, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానరాజకీయ పార్టీల మధ్య పొత్తులు చిత్ర విచిత్రంగా ఉన్నయి. కొత్తగూడెంలో సీపీఐ – టీడీపీ కలిసి బరిలోకి దిగాయి. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 60 డివిజన్లలో మొత్తం 807 మంది నామినేషన్లు దాఖలు చేశారు. స్క్రూట్‌ని అనంతరం 588 మంది అభ్యర్థులు ఉన్నారు. 234 మంది విత్ డ్రా చేసుకున్నారు.
అశ్వారావుపేటలో ఒకవైపుబీఆర్ఎస్ – టీడీపీ, మరోవైపు కాంగ్రెస్ – సిపిఎం ల మధ్య పొత్తు కుదిరింది. ఏదులాపురం, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో సీపీఎం – బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకున్నాయి. ఇల్లెందులో సీపీఐ, సీపీఎం, మాస్ లైన్, బీఆర్ఎస్ కూటమిగా ఏర్పడ్డాయి. మధిరలో కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భిన్న పార్టీల కలయికలతో పొత్తు పెట్టుకుని పోటీచేస్తున్నాయి. కానీ అన్ని రాజకీయ పార్టీలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితమైన స్టాండ్‌తో ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో గానీ మెన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో టిడిపి పోటీ లో లేదు. పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు అభ్యర్థులను పోటీ పెట్టకుండా విరమించుంది. పైగా మరే ఇతర పార్టీకీ రాజకీయంగా మద్దతు తెలపలేదు. పొత్తుకోసం రాష్ట్ర బిజెపి నాయకత్వం స్థానిక టిడిపి నాయకులను సంప్రదించినప్పటికీ ప్రయోజనం లేదు. పొత్తుల్లేవని తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జి వాసిరెడ్డి రామనాథం తెగేసి చెప్పారు .
ఏ.పి. లో టిడిపి తో కలసి కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ, జనసేన తమ అభ్యర్థులకు బీ ఫారాలు కేటాయించగా, టీడీపీ మాత్రం బీ ఫారాలు ఇవ్వలేదు. బరిలో నిలిచిన ఆయా పార్టీల అభ్యర్థులు సదరు పార్టీల ఎన్నికల గుర్తులతోనే పోటీలో ఉన్నారు. విచిత్రంగా అశ్వారావుపేట మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీ బీ ఫారాన్ని ఇచ్చింది. టీడీపీ నాయకుడు (అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి) ‘కారు’ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్న టిడిపికి చెందినవారు ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులతో పోటీ చేస్తున్నారు.
Also Read: Oppo Reno 14: ఓప్పో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై రూ.6000 ధర తగ్గింపు.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
కొత్తగూడెం కార్పొరేషన్ లో మూడు డివిజన్లను టీడీపీకి కేటాయించారు. అయితే సిపిఐ తో పొత్తు కుదుర్చుకుని పోటీ చేస్తున్న ఆ ముగ్గురు టీడీపీ అభ్యర్థులకు బీ – ఫారాలు సీపీఐ కేటాయించింది. ఆ ముగ్గురు చాలా ఏళ్లుగా సిపిఐ తో కలిసి ప్రయాణం చేస్తున్నందున ఆ ముగ్గురు అభ్యర్థులకు తామే బీ ఫారాలు ఇచ్చామని సిపిఐ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో టీడీపీ అభ్యర్థులు కంకి – కొడవలి గుర్తు ను చూపి, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని అభ్యర్థించాల్సిన చిత్ర విచిత్రాలు ఇక్కడ ఆవిష్కరించాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారిన పొలిటికల్ పార్టీల అనధికారక పొత్తులు. కంకి – కొడవలి, కారు గుర్తులపై పోటీ చేస్తున్న అభ్యర్థులు రాజకీయ పార్టీపరంగా టీడీపీకి చెందినవారైనప్పటీకీ ప్రస్తుతం సాంకేతికంగా సీపీఐ, బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అయితే అసలు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కు ఇతర పార్టీల గుర్తులతో తమ పార్టీవారు పోటీలో ఉన్నట్లు సమాచారం ఉందా? లేదా? ఉంటే తీసుకునే చర్యలేంటీ? అనేది వేచిచూసే అంశం.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశావాహులైన పలుకుబడి కలిగిన టిడిపి కి చెందిన సీనియర్ లకు సైతం సైకిల్ గుర్తు లేదు. తెలుగు దేశం పార్టీ తీసుకున్న స్టాండ్ వల్ల ఇక్కడి టిడిపి అభ్యర్థుల ఎన్నికల గుర్తు సైతం మారిపోవడమేఅసలు విశేషం. పర్యవసానం గా కొత్తగూడెం కార్పొరేషన్లో ని 5, 37, 42 నెంబర్లు గల డివిజన్లలో బరిలోకి వచ్చిన టీడీపీ అభ్యర్థులు సీపీఐకి చెందిన ‘కంకి కొడవలి’ గుర్తుపై పోటీ చేస్తున్నారు. 3 డివిజన్లలో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు సీపీఐ పార్టీ బీ ఫారాన్ని ఇచ్చింది. దీంతో టిడిపి నాయకు లైనప్పటికీ కంకి కొడవలి గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించాల్సి వస్తోంది.
Also Read: Mahesh Babu: వారణాసి కోసం 15 ఏళ్ల నిరీక్షణ… అసలు విషయం చెప్పిన మహేష్!