SC Stay On Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికల కోసం కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ గ్రామాలపై గిరిజన వర్సెస్ గిరిజనేతర వివాదం కొనసాగుతోంది. ఈ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పేర్కొంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును ఈ గ్రామాల గిరిజనేతరులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
మంగపేట మండలంలోని 23 గ్రామాలు గిరిజన పరిధిలో లేవని 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులపై 2013లో గిరిజన సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. నిజాం ఆర్డర్ ఆధారంగా ఈ 23 గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే భారత రాష్ట్రపతి ఉత్తర్వులను కాదని, నిజాం ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవడంపై గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ గ్రామాలను గిరిజన గ్రామాలుగా గుర్తించవద్దని పిటిషన్‌లో పేర్కొన్నారు.
1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మంగపేట మండలంలోని 23 గ్రామాలు గిరిజన జాబితాలో లేవని గిరిజనేతరుల తరఫు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై స్టే విధించాలని కోరారు. దీంతో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. మంగపేట మండలంలోని 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు గిరిజన గ్రామాలేనని, అవన్నీ ఐదో షెడ్యూల్ పరిధిలోకే వస్తాయని తెలంగాణ 2023లో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆ 23 గ్రామాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అప్పట్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ సమర్థించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఆ గ్రామాలన్నింటినీ1940కి ముందే నిజాం సర్కార్ షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించిందని కోర్టు తెలిపింది.
Also Read: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు
రాజ్యాంగం అమల్లోకి వచ్చాక తాలుకాల పునర్విభజన భాగంగా 1950 ఏప్రిల్ 21న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా పాల్వంచ షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోని 23 రెవెన్యూ గ్రామాలను ములుగు మంగపేటలో విలీనం చేశారు. దీనిపై వివాదం ఏర్పడటంతో 1950 నుంచి 2006 వరకు ఆ గ్రామాలను గిరిజన ప్రాంతాలుగా గుర్తింపునకు నోచుకోలేదు. 2006లో ఈ గ్రామాలను గిరిజన ఏరియాగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ వివాదం వల్ల 2006 నుంచి ఈ గ్రామాల్లో ఎన్నికలు జరగలేదు.1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని షెడ్యూలు 5 పేరా 8(1)లో ఈ గ్రామాలను చేర్చలేదని పిటిషనర్లు కోర్టులో వాదనలు వినిపించారు.