Notice to MLAs: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు శాసనసభ కార్యదర్శి. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా ఈ నోటీసులు పంపించారు. దీనిపై కొందరు ఎమ్మెల్యేలు స్పందించారు. వివరణ ఇచ్చేందుకు కొంత సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఫిరాయింపు దారులపై కారు పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ నోటీసులు ఇచ్చారు అసెంబ్లీ సెక్రటరీ.
పార్టీని కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. పార్టీకి డ్యామేజ్ కాకుండా ఉండేలా స్కెచ్ వేసింది. వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది. వెళ్లిన, రేపో మాపో వెళ్లేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలను అడ్డుకోవాలని భావిస్తోంది. దీనికి సంబంధించి తీవ్రప్రయత్నాలు చేస్తోంది. అయినా కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీ అయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ అంతర్గత సమాచారం ప్రకారం.. మరో 12 మంది కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అదే జరిగితే మొదటికి ముప్పు వస్తుందని ఆలోచన చేస్తోంది కారు పార్టీ. డజను మంది ఎమ్మెల్యేలు పోతే ఆ పార్టీకి సభలో ప్రతిపక్ష హోదా కోల్పోతుంది. దీన్ని ముందుగానే గమనించిన బీఆర్ఎస్ పెద్దలు న్యాయస్థానం తలుపు తట్టారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ పిటిషన్‌పై ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. గతంలో వేసిన పిటిషన్‌తో కలిసి దీన్ని విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.
ALSO READ: సభ వాయిదా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసహనం
ఈ నేపథ్యంలో మంగళవారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు అసెంబ్లీ కార్యదర్శి. ఈ క్రమంలో స్పీకర్‌తో భేటీ అయ్యారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. వారిలో గాంధీ, యాదయ్యతోపాటు ప్రకాష్ ఉన్నారు. స్పీకర్ కార్యాలయ నుండి తమకు నోటీసులు వచ్చాయని కొందరు ఎమ్మెల్యేలు అంగీకరించారు. న్యాయ నిపుణులను సంప్రదించి తగు నిర్ణయం చెప్పుతామన్నారు. వివరణకు తమకు కొంత గడువు కావాలని కోరారు.
కేవలం ప్రాంతీయ పార్టీల నుంచే కాకుండా జాతీయ పార్టీలకు చెందిన నేతలు సైతం మరో పార్టీకి వెళ్తున్నారు. అయినా ఆయా పార్టీలు వీటిని తేలిగ్గా తీసుకుంటున్నాయి. కానీ, ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్యేలను ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఇలాంటి ఈ ప్రయోగాలను కారు పార్టీ చేసిందని అంటున్నారు కొందరు నేతలు.
మిగతా నేతలు వెళ్లిపోతే పార్టీ ఉండదని భావించిన తరచు న్యాయస్థానం గడప తొక్కుతున్నారని అంటున్నారు. నియోజకవర్గం అభివృద్ధిపై ఏ ప్రభుత్వాలు ఫోకస్ చేస్తాయో నేతలు ఆయా పార్టీలకు వెళ్లడం సహజంగా మారింది. అసలు 2014 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నేతల ఫిరాయింపులను తొలుత ప్రొత్సహించింది బీఆర్ఎస్ పార్టీయేనన్నది కొందరు నేతల మాట. వారి రాజకీయ కోసం తమను బలిపశువు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవహారంపై కారులో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు
నోటీసులు పంపిన శాసనసభ కార్యదర్శి
బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ల ఆధారంగా నోటీసులు
వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని కోరిన ఎమ్మెల్యేలు pic.twitter.com/EJMGDH5kO2
— BIG TV Breaking News (@bigtvtelugu) February 4, 2025