Bhu Bharati portal: భూ పరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కొత్తగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ ,రిజిస్ట్రేషన్ , ఎన్ఐసి అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ భూభారతి పోర్టల్‌ను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి భూలావాదేవీ వివరాలు కనిపించేలా పారదర్శకంగా ఈ పోర్టల్‌ను రూపొందించినట్లు వెల్లడించారు.
ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను నారాయణపేట జిల్లా కొస్గి, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలాల్లో వచ్చేనెల 2వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పైలట్ మండలాల్లో మెరిట్- డీమెరిట్ లను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి అవసరమైన మార్పులు చేర్పులు చేసి రెండవ దశలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని అలాగే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపి భూభారతి పోర్టల్‌ను కూడా తీసుకురావడం జరిగిందన్నారు. భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
తద్వారా రాష్ట్రంలో భూవివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ ఐదు మండలాల్లో ప్రతి సర్వే నెంబరుకు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ నెంబర్‌ను కూడా ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నక్షాలేని ఐదు గ్రామాల్లో రీసర్వే నిర్వహించి భూధార్ నెంబర్‌ను కేటాయించడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నాకూడా ప్రజా కోణంలోనే ఉంటుందన్నారు. ఒక క్లిక్ తో రైతులకు సంబంధించిన భూముల పూర్తి సమాచారం లభించేలా చాలా సులువుగా, సులభతరంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను రూపొందించామన్నారు.
Also Read: Jio Recharge Plan: జియో నయా ప్లాన్.. 25GB డేటా, ఫ్రీ ఓటీటీలు.. 3 నెలల పాటు నాన్ స్టాప్ వినోదం!
ఆధార్ నెంబర్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన వెంటనే కావలసిన సమాచారం పోర్టల్ లో లభిస్తుందని మంత్రి తెలిపారు. అదేవిధంగా ఈ పోర్టల్‌లో ప్రధానంగా సమాచారం సేవలు, సర్వే సేవలు, కరెక్షన్ సేవలు, అప్పీల్ సేవలు, రిజిస్ట్రేషన్ సేవలతోపాటు మైల్యాండ్ పోర్ట్‌ఫోలియో, నాలా ఆర్డర్స్, విలేజ్ మ్యాప్ తదితర సేవలను భూభారతి పోర్టల్ ద్వారా ప్రజలకు చేరువ చేయబోతున్నట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్, ఇతర భూసేవలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకు ప్రతి స్టేజ్ లో దాని వివరాలను తెలియజేస్తూ SMS ద్వారా ఖాతాదారునికి సమాచారం చేరవేస్తామని మంత్రి పొంగులేటి వివరించారు.
Also Read: Vi Plans: వీఐ సరికొత్త ప్లాన్స్.. అపరిమిత 5G డేటా, ఫ్రీ కాల్స్.. రోజుకు రూ.11 మాత్రమే!