Telangana Cabinet Meeting: సోమవారం(జూన్ 23)న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్‌లో మంత్రివర్గ మీటింగ్ జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా ఏపీలో చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపైనే కేబినెట్‌లో ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ ప్రాజెక్టుపై చర్చలకు సిద్ధమని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే బనకచర్ల సమస్య పరిష్కారమవుతుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
ఈ విషయంలో తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. అవసరమైతే ఏపీ ముఖ్యమంత్రిని తామే చర్చలకు ఆహ్వానిస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఏ రాష్ట్రంతోనూ తాము వివాదాలు కోరుకోవడం లేదని తెలిపారు రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో రాష్ట్ర హక్కులను వదులుకోబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీతో జరిగే చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహం మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై డీప్‌గా డిస్కస్ చేసి.. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇదే అంశంపై ఇప్పటికే స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. బనకచర్లపై పోరాటం ఎందుకని ప్రశ్నించారాయన. ప్రాజెక్టులు కట్టి నీరు తీసుకోండని సూచించారు. రెండు రాష్ట్రాల వాళ్లూ ఢిల్లీ వెళ్లి కూర్చొని మాట్లాడుతామని స్పష్టం చేశారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దామని పిలుపునిచ్చారాయన. కొట్టుకుంటే లాభం లేదన్న ఏపీ సీఎం.. కేటాయింపుల ప్రకారమే నడుచుకుందామన్నారు. ట్రైబ్యునల్ నివేదిక మేరకు చర్యలు తీసుకుందామని నిర్ణయించినట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
కేంద్ర ప్రభుత్వం ముందు ఈ అంశాలన్నింటిపై మాట్లాడుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతుంటే.. అవసరమైతే ఏపీ ముఖ్యమంత్రిని తామే చర్చలకు పిలుస్తామని చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై ఒకసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయి. దీంతో.. మరోసారి ఇద్దరు సీఎంలు కూర్చుంటే బనకచర్ల సమస్య సైతం పరిష్కారం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం సైతం రెండు రాష్ట్రాలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటేనే సమస్య పరిష్కారమవుతుందన్న భావనలో ఉంది. ఇదే విషయాన్ని ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సైతం సూచించిందన్న మాట విన్పిస్తోంది.
Also Read: బిగ్ షాక్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదు
ఇక తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. హైకోర్టులో ఉన్న కేసు, రిజర్వేషన్లు, ముందు సర్పంచ్ ఎన్నికలా లేదా ఎంపీటీసీనా? అనే అంశాలపై చర్చ జరిగే చాన్స్ ఉంది. మరోవైపు వీటితో పాటుగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం నిధుల సమీకరణ, అమలు విధానాలపై చర్చ జరగనుంది. ఈ పథకాలకు సంబంధించిన ఆర్థిక కేటాయింపులు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలను సమీక్షించే అవకాశం ఉంది.