TS CEO Vikas Press Meet on Lok Sabha Elections 2024: తెలంగాణలో ప్రశాంత వాతావరణంలో పార్లమెంటు ఎన్నికలు సజావుగా సాగాయని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తలేదన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని ఆయన అన్నారు. మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా వచ్చారని తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 61.16 శాతం పోలింగ్ నమోదైందని ఆయన పేర్కొన్నారు. అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం నమోదైనట్లు ఆయన చెప్పారు. అయితే, పోలింగ్ శాతంపై రేపటికి క్లారిటీ వస్తుందన్నారు. వేరు వేరు ప్రాంతాల్లో 38 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయన్నారు. భారీ బందోబస్తు తో స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంలను భద్రపరుస్తామని ఆయన తెలిపారు.
కాగా, తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పలు చోట్లా సాయంత్రం 6 గంటల లోపు క్యూలైన్లలో నిలుచున్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూర్, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.
ఈ ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించి నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసి ఎన్నికలు జరిపారు. ఈ క్రమంలో ఇక్కడ సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
Also Read: ప్రముఖులు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే..?
కాగా, ఉదయం, సాయంత్రం సమయంలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా వచ్చారని అధికారులు పేర్కొన్నారు. ఆ సమయంలో ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.