Climate Resilience: వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునే సుస్థిర తెలంగాణ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద కాలపు సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ క్లైమేట్ కాన్‌క్లేవ్–2026 కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని శుక్రవారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో నిర్వహించనున్నారు.ఎల్‌నినో ప్రభావం, జల భద్రత, కరవు నివారణ, వాతావరణ అనుకూల వ్యవసాయం, హరిత వృద్ధి ప్రధానాంశాలుగా జరిగే ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ క్లైమేట్ రెసిలియన్స్ అజెండా–2026-2036 రూపకల్పనకు పునాది వేయనున్నారు.
ప్రకృతి విపత్తులు సంభవించిన తరువాత స్పందించే విధానానికి బదులుగా ముందస్తు సన్నద్ధత, శాస్త్రీయ ప్రణాళిక, ప్రభుత్వ శాఖల సమన్వయంతో వాతావరణ సవాళ్లను ఎదుర్కొనే దిశగా ఈ అజెండాను రూపొందించనున్నారు. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా తలెత్తే వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేసి, వాటిని సమర్థంగా ఎదుర్కొనే కార్యాచరణపై కాన్‌క్లేవ్‌లో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. సదస్సు ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షిస్తూ, వివిధ శాఖల మధ్య సమన్వయం చేస్తున్నారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క పాల్గొంటారు.ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.
పద్మశ్రీ పురస్కార గ్రహీత, సేంద్రియ వ్యవసాయ ఆవిష్కర్త చింతల వెంకట్‌రెడ్డి, సుస్థిర వ్యవసాయ నిపుణుడు డాక్టర్ జి.వి. రామాంజనేయులు కూడా పాల్గొంటారు.తాగునీటి భద్రత, శాస్త్రీయ జల నిర్వహణ, చెరువులు–జల వనరుల పునరుద్ధరణ, వాటర్‌షెడ్ అభివృద్ధి, కరవు నివారణ చర్యలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన వ్యవసాయ విధానాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనుంది.ఐదు అంశాలపై రౌండ్ టేబుల్ చర్చలు జరుగనున్నాయి.
జల భద్రత–సాగునీరు, పట్టణ వాతావరణ సవాళ్లు–ప్రజారోగ్యం, జీవ వైవిధ్యం, అడవులు–పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం–జీవనోపాధులు, పునరుత్పాదక ఇంధనం–సర్క్యులర్ ఎకానమీ, విధాన నిర్ణేతలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నిపుణులతోపాటు రైతులు, సర్పంచులు, మహిళా స్వయం సహాయక సంఘాలు, మత్స్యకారులు, అటవీ పరిరక్షణ కమిటీల సభ్యులు, వైద్యులు, ఇంజినీర్లను కూడా ఈ చర్చల్లో భాగస్వాములను చేయనున్నారు. క్షేత్రస్థాయి అనుభవాలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనలను గుర్తించనున్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో భాగంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రధాన తెలంగాణ క్లైమేట్ కాన్‌క్లేవ్–2026ను నిర్వహించనున్నారు.
Also read: సాగర్ జలాలపై కాక రేపుతున్న రాజకీయం.. ఇక అదొక్కటే మార్గమా..?