Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాల పంపిణీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) వద్ద నీటి కేటాయింపులపై స్పష్టత రాకముందే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటాపోటీగా కాలువలకు నీటిని విడుదల చేయడం కొత్త వివాదానికి దారితీసింది. ఏపీ అధికారులు సాగర్ కుడి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయగా.. తెలంగాణ అధికారులు ఎడమ ప్రధాన కాలువ ద్వారా జలాలను దిగువకు వదిలారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం రాజుకుంది. ప్రస్తుతం కుడి కాలువకు 6,324 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 3,549 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం సాయంత్రం సాగర్‌కు 5,663 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మొత్తం 11,873 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.అయితే కుడికాలువకు 10 రోజులపాటు తాగునీటి అవసరాల కోసం 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు ఏపీ అధికారులు తెలిపారు. ఎడమకాలువ ద్వారా అడవిదేవులపల్లి, పాలేరు రిజర్వాయర్లను నింపేందుకు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలంగాణ అధికారులు వెల్లడించారు.
నాగార్జునసాగర్ జలాలను తమ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా డెల్టా అవసరాలకు నీటిని విడుదల చేయాలని ఏపీ కోరుతుండగా.. సాగర్‌లో పరిమితంగా ఉన్న జలాలను ప్రధానంగా తాగునీటి అవసరాలకు కేటాయించాలని తెలంగాణ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో కేఆర్‌ఎంబీ స్థాయిలో చర్చలు జరిగినా నీటి పంపకాలపై పూర్తిస్థాయి ఏకాభిప్రాయం కుదరలేదు.ఈ పరిస్థితుల్లో ఏపీ అధికారులు సాగర్ కుడి కాలువకు గురువారం ఉదయం నీటిని విడుదల చేయడంతో తెలంగాణ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పోటీగా ఎడమ కాలువ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి విడుదల అంశం వివాదాస్పదంగా మారింది. బోర్డు పరిధిలో చర్చలు కొనసాగుతుండగానే క్షేత్రస్థాయిలో రెండు రాష్ట్రాలు వేర్వేరుగా నిర్ణయాలు తీసుకోవడం ప్రాజెక్టు నిర్వహణ, నీటి నియంత్రణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
హైదరాబాద్‌లో ఈ నెల 23న కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. సాగర్ జలాల పంపిణీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు తమ తమ అవసరాలను వివరించారు. అయితే కృష్ణా డెల్టా వ్యవస్థకు నీటి విడుదల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తదుపరి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కమిటీ సూచించింది.కేఆర్‌ఎంబీ లెక్కల ప్రకారం ఈ నెల 23 నాటికి సాగర్‌లో 510 అడుగుల కనీస నీటిమట్టానికి పైన 45.40 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఆవిరి నష్టాలను మినహాయిస్తే వినియోగానికి 40.86 టీఎంసీలు మాత్రమే మిగులుతాయని అంచనా. ప్రాజెక్టుకు కొత్తగా ఇన్‌ఫ్లోలు లేకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది.
Also read: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ రూట్లో వన్ వే..?
డిసెంబరు నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు తమ అవసరాలకు మొత్తం 21 టీఎంసీల నీరు కావాలని తెలంగాణ అధికారులు కేఆర్‌ఎంబీకి ఇండెంట్ సమర్పించారు. ఇందులో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు 15 టీఎంసీలు, ఏఎంఆర్‌పీకి 6 టీఎంసీలు అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి కేటాయింపులు జరపాలని కోరుతున్నారు.మరోవైపు కృష్ణా డెల్టా వ్యవస్థకు 10 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉందని ఏపీ అధికారులు వాదిస్తున్నారు. తమ రాష్ట్రంలోని తాగునీటి అవసరాలతోపాటు సాగునీటి అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ అంశంలో రెండు రాష్ట్రాల మధ్య అభిప్రాయభేదాలు కొనసాగుతుండటంతో నీటి పంపిణీ వ్యవహారం కొలిక్కి రావడం లేదు.
సాగర్‌లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను వచ్చే వర్షాకాలం వరకు జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు హైదరాబాద్ జంటనగరాలు, నల్గొండ, ఖమ్మం తదితర ప్రాంతాల తాగునీటి అవసరాలు ఉండగా.. మరోవైపు ఏపీ పరిధిలోని పలు జిల్లాల అవసరాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేఆర్‌ఎంబీ సమన్వయంతో నీటి విడుదల జరగాల్సిన అవసరం ఉందని నీటిపారుదల రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా నీటిని విడుదల చేస్తే సాగర్‌లో నిల్వలు వేగంగా తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొత్తగా వరద ప్రవాహాలు లేకపోవడంతో అందుబాటులో ఉన్న జలాలను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాల్సి ఉంది. తాగునీటికి ప్రాధాన్యమిస్తూ, అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించకపోతే రానున్న వేసవిలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
నాగార్జునసాగర్ రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన జలవనరు. ఈ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల, నిర్వహణ, వినియోగం వంటి అంశాలపై కేఆర్‌ఎంబీ పర్యవేక్షణలో సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇరు రాష్ట్రాల అధికారులు పరస్పర సమాచార మార్పిడితో నిర్ణయాలు తీసుకోవాలని, తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. తదుపరి కేఆర్‌ఎంబీ సమావేశంలోనైనా నీటి పంపకాలపై స్పష్టత వస్తుందా? అప్పటివరకు కాలువలకు కొనసాగుతున్న నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
Also read: బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా లెక్క తేలుస్తా: సీఎం రేవంత్ సవాల్!