Defence Aerospace: తెలంగాణలో సంప్రదాయంగా బలమైన ఐటీ, ఫార్మా రంగాల కంటే రక్షణ, ఏరోస్పేస్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ రంగాల్లో ఉత్పత్తి, ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 100 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో బలంగా వేళ్లూనుకున్న తయారీ వ్యవస్థను, ప్రపంచ రక్షణ–ఏరోస్పేస్ మార్కెట్లలో వస్తున్న అవకాశాలను పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ టు గ్లోబల్ మార్కెట్స్–బిల్డింగ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సప్లై చైన్స్” ఇతివృత్తంతో నిర్వహించిన సీఐఐ తెలంగాణ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కాన్‌క్లేవ్–2026ను హోటల్ కాకతీయ లో గురువారం ప్రారంభించి మాట్లాడారు.
ప్రపంచ రక్షణ, ఏరోస్పేస్ తయారీ–సరఫరా వ్యవస్థల్లో తెలంగాణ కీలక భాగస్వామిగా ఎదిగేందుకు అవసరమైన అన్ని అనుకూలతలు రాష్ట్రానికి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దేశీయ అవసరాలకే పరిమితం కావొద్దు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఔషధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు. ఇప్పుడు రక్షణ, ఏరోస్పేస్ తయారీ రంగం పెట్టుబడులు, ఎగుమతులు, ఉపాధి కల్పనకు అపార అవకాశాలున్న వేగవంతమైన పారిశ్రామిక రంగంగా ఎదుగుతోందన్నారు. రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడే స్థాయి నుంచి స్వదేశీ తయారీ సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తులను అభివృద్ధి చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోందని చెప్పారు.
ఈ పరిణామం ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు భారీ అవకాశాలను తెరిచిందన్నారు.మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థల అవసరం కూడా భారత్‌కు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. రక్షణ, ఏరోస్పేస్ సరఫరా మార్గాలను విస్తరించుకోవాలని భావిస్తున్న దేశాలకు భారత్ నమ్మకమైన తయారీ భాగస్వామిగా ఎదగగలదని అభిప్రాయపడ్డారు. ప్రముఖ రక్షణ పరిశోధనా సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, అగ్రశ్రేణి ప్రైవేటు కంపెనీలు, ఎంఎస్‌ఎంఈలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటం వల్ల రాష్ట్రంలో పటిష్ఠమైన పారిశ్రామిక వ్యవస్థ ఏర్పడిందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల భాగస్వామ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు.
Also Read: మద్దిమడుగు సభలో.. లంబాడీలకు సీఎం రేవంత్ సంచలన హామీలు!
భారీ పరిశ్రమలు, అంతర్జాతీయ తయారీ సంస్థలు దేశీయ చిన్న పరిశ్రమలతో కలిసి పనిచేయాలని కోరారు. అంతర్జాతీయ నాణ్యత, తయారీ ప్రమాణాలను అందుకునేందుకు ఎంఎస్‌ఎంఈలకు అవసరమైన సాంకేతిక సహకారం అందించాలన్నారు. తెలంగాణకు చెందిన సంస్థలు దేశీయ రక్షణ అవసరాలను తీర్చడానికే పరిమితం కాకుండా, ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణ, ఏరోస్పేస్ కంపెనీలకు సరఫరాదారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో భాగంగా నిర్వహించనున్న రక్షా ఎక్స్‌పోలో పాల్గొనాలని జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ రక్షణ–ఏరోస్పేస్ తయారీ సంస్థలు, సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు, పెట్టుబడిదారులు, స్టార్టప్‌లు, ఇతర భాగస్వాములను ఈ ఎక్స్‌పో ఒకే వేదికపైకి తీసుకురానుందని తెలిపారు. తెలంగాణలో తయారయ్యే ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు చేరే స్థాయికి రాష్ట్రం ఎదుగుతుందని అన్నారు. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు డాక్టర్ జి. సతీశ్‌రెడ్డి, సీఐఐ తెలంగాణ చైర్మన్ ఎం. గౌతమ్‌రెడ్డితోపాటు రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు చెందిన ప్రముఖ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
Also read: తెలంగాణలో కొత్త అస్త్రం.. ‘రుద్రమ సేన’ రంగప్రవేశం.. ఆడసింహాల్లా గర్జిద్దామన్న కవిత!