Telangana CM : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపై తొలి సంతకం చేశారు. దివ్యాంగురాలు రజనికి ఉద్యోగం ఇచ్చే ఫైల్ పై రెండో సంతకం చేశారు. ఆమెకు ఉద్యోగ నియామక పత్రం అందించారు. ఆ తర్వాత తాజ్‌కృష్ణ హోటల్‌లో కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు . వివిధ అంశాలపై చర్చించారు. అలాగే కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు.
సీఎంకు అధికారులను సీఎస్ శాంతి కుమారి పరిచయం చేశారు. ఆరు గ్యారెంటీ స్కీమ్‌లపై చర్చ జరుగుతోంది. ఈ భేటీలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.
మరోవైపు ప్రభుత్వంలో అధికారుల నియామకం విషయంలోనూ రేవంత్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి నియమించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని నియమించారు. హోటల్ తాజ్ కృష్ణలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనే తెలంగాణ డీజీపీగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. సజ్జనార్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సన్నిహితుడిగా తెలుస్తోంది.
అంతేకాదు మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కీలక స్థానాల్లో పనిచేసిన ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను స్థానచలనం ఉండక తప్పదని తెలుస్తోంది. కేసీఆర్ పాలనలో కీలక పాత్ర పోషించిన మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను కొనసాగిస్తారా? లేదా? అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
పరిపాలనలో బీహార్ అధికారులకు బదులు తెలంగాణ అధికారులకు కీలక స్థానాలు ఇవ్వాలనేది మొదటి నుంచి రేవంత్ రెడ్డి చేస్తున్న డిమాండ్. అంతేకాదు ఆయన డీజీపీని కూడా మార్చాలన్నారు. అయితే డీజీపీగా ఉన్న అంజనీకుమార్ ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. మరో వైపు హైదరాబాద్ నగర పోలీసు కమిషనరుగా పనిచేసిన సీవీ ఆనంద్ ను ఈసీ బదిలీ చేసింది. డీజీపీగా రవి గుప్తా, హైదరాబాద్ నగర పోలీసు కమిషనరుగా సందీప్ శాండిల్యా పనిచేస్తున్నారు. మరి వీరినే కొనసాగిస్తారా? లేదా? అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది.
మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రమాణ స్వీకారం తర్వాత X వేదికగా ఓ పోస్టు పెట్టారు.”తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది. బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల ముఖాల్లో వెలుగులు వెల్లివిరుస్తాయి. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి. నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి. ఇది మీ అన్న ఇస్తున్న మాట.” అని పోస్టు పెట్టారు.
ఇలా సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ పాలనలో నిమగ్నమైపోయారు. చెప్పినట్లుగా ప్రగతి భవన్ వద్ద ఆంక్షలు ఎత్తివేశారు. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటీ నెరవేర్చే పనిని మొదలుపెట్టారు.