Tribute to PV Narasimha Rao: హైదారాబాద్, స్వేచ్ఛ: ‘భారత రత్న’, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు 20వ వర్థంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు సోమవారం నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి పీవీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బహుభాషా కోవిదుడు, భారత మాజీ ప్రధాని పీవీ సేవలు చిరస్మరణీయమని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతికి దిశా నిర్దేశం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు. ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, తదితరులు ఉన్నారు. గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ నివాళులు సమర్పించారు.
పీవీ రాజకీయ చతురత ఆదర్శం: కిషన్ రెడ్డి
పీవీ నరసింహా రావుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న పీవీ ఘాట్‌లో పీవీ కుటుంబ సభ్యులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. భారతరత్న, తెలుగు ప్రజలు గర్వించదగ్గ మహనీయుడు పీవీ నరసింహారావు అని కిషన్ రెడ్డి కొనియాడారు. ‘‘పీవీ రాజకీయ చతురత, పాత్రికేయ పరిజ్ఞానం, బహుభాషా నైపుణ్యం, సాహితీ పిపాస మనందరికీ ఆదర్శం. భిన్న రంగాలపై తనదైన ముద్రవేయడమే కాకుండా భారతదేశాన్ని ఆర్థిక ప్రగతి వైపు తీసుకెళ్లడంలో వారి కృషి ఎనలేనిది. పీవీ నరసింహా రావు జీవితం, నిజాం వ్యతిరేకపోరాటంలో ఆయన చూపిన తెగువ నేటి తెలంగాణ యువతకు స్ఫూర్తిదాయకం’’ అని ఆయన కొనియాడారు.
పీవీ తెలంగాణ ముద్దు బిడ్డ: మంత్రి పొన్నం
పీవీ ఘాట్ వద్ద రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు నివాళులు అర్పించారు. అనంతరం పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులతో కలిసి ‘భారతరత్న క్యాలెండర్’ను మంత్రి ఆవిష్కరించారు. ఘాట్ ప్రాంగణంలో ‘ఐ క్యాంప్’ను ప్రారంభించి కళ్లద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పీవీ తెలంగాణ ముద్దుబిడ్డ అని కొనియాడారు. ‘‘ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్‌కి సంబంధించిన బిడ్డ. ఆయన అంత అత్యున్నత స్థానానికి ఎదగడం అందరికీ గర్వ కారణం. పీవీ జ్ఞాపకాన్ని, ఆయన సూచించిన మార్గదర్శకత్వం ఈనాటి యువత అవలంభిస్తే అందరూ సన్మార్గంలో నడుస్తారు. బహుభాషా కోవిదుడుగా, అపార జ్ఞానంతో అపార చాణక్యుడిగా రాజకీయంగా పదవులే తన వద్దకు వచ్చే విధంగా మౌనంగా మెలిగారు. పీవీ ఘనత అందరికీ గర్వ కారణం’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు.
పీవీ.. తెలంగాణ ఠీవి: కేటీఆర్
ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో జన్మించడం మనందరికి గర్వకారణమని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ‘‘గడ్డుకాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడి, తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావును బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది. పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. నెక్లెస్ రోడ్‌కి పీవీ మార్గ్ అని పేరు పెట్టింది. పీవీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ గారి పేరు పెట్టింది. ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు గారి వర్థంతి సందర్భంగా ఘన నివాళులు’’ అని ఆయన పేర్కొన్నారు.
ALSO READ: రాజకీయ డ్రామాలొద్దు.. ఆ రెండు పార్టీలకు వీహెచ్ సూచన