Addanki On KTR: హైదరాబాద్‌లో పోచంపల్లి ఫామ్ హౌస్ వ్యవహారంపై నోరు విప్పారు తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణను క్యాసినో హబ్‌గా కేటీఆర్ మార్చారని ఆరోపించారు. అత్యాధునిక హంగులతో విదేశాల్లో ఆడే క్యాసినో, జూదాలు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఫామ్ హౌస్‌లో జరగడం దేనికి సంకేతమన్నారు.
కేటీఆర్ బావమరిది ఇంట్లో ఓ పార్టీలో కొకైన్ పట్టుబడిందని గుర్తు చేశారు అద్దంకి. ఆ మాత్రం తీసుకోవద్దా అన్నట్లుగా మాట్లాడుతున్నారని కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరుగుతున్న అక్రమాలకు ముమ్మాటికీ బాధ్యుడు కేటీఆరేనని అన్నారు. కేటీఆర్ కూడా శిక్షార్హుడేనని మనసులోని మాట బయపెట్టారు.
దొంగలకు లీజుకు ఇస్తే.. వాళ్ళు దొంగలే అవుతారన్నారు. సూరత్ పోర్టు నుంచి తెలుగు రాష్ట్రాలకు గంజాయి వస్తుందన్నారు. ఇక పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ గుట్టు బయట పడిందన్నారు. పీసీసీ హోదాలో రేవంత్ వైట్ చాలెంజ్ చేస్తే కేటీఆర్ హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు.
కేసీఆర్ కుటుంబంలో నలుగురు.. వాళ్ళ కోసం మాత్రమే పోరాటం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయంలో ఇచ్చిన పర్మిషన్ తో రెండేళ్ల నుంచి ఈ పందెలు జరుగుతున్నాయని రుసరుసలాడారు. ఫార్ములా రేస్‌లో విచారణకు వెళ్లినప్పుడు జై తెలంగాణ అంటారని, ఆ హక్కు ఆయనకు ఏ మాత్రం లేదన్నారు.
ALSO READ: మెయినాబాద్ ఫామ్‌హౌస్ వ్యవహారం.. ఎమ్మెల్సీకి నోటీసులు
పది మంది ఎమ్మెల్యేలు ఎందుకో పార్టీ ఫిరాయించారో ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలన్నారు. హీరో కావడానికి జీరో పనులు కేటీఆర్ చేస్తున్నారని దుయ్యబట్టారు. నాలుగేళ్ల తర్వాత కూడా కేసీఆర్ బయటకి వచ్చే పరిస్థితి లేదన్నారు. రాబోయే రోజుల్లో మెయినాబాద్ ఫామ్ హౌస్ గురించి అద్దంకి దయాకర్ ఇంకెన్ని కొత్త విషయాలు బయటపెడతారో చూడాలి.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కావాలని ఆశిస్తున్నట్టు మనసులోని మాట బయటపెట్టారు. ప్రభుత్వం, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణలో ఎలాంటి కుట్ర లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ వర్గాన్ని దూరం చేసుకోదనితెలిపారు. కుల గణన సర్వేలో కేసీఆర్,కేటీఆర్,డీకే అరుణ లు ఇప్పటికైనా పాల్గొని వివరాలు ఇవ్వాలన్నారు.