Notices To MLC Pochampally: మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు వ్యవహారం తీగ లాగితే డొంక కదులుతోంది. కోడి పందాలు, కేసినో వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు మొయినాబాద్ పోలీసులు. ఆయన ఫామ్‌హౌస్ ఓనర్‌గా ఉన్నారు. దీంతో ఈ ఫామ్‌హౌస్ గుట్టు బయటపడుతుందా?
పోచంపల్లి ఫామ్ హౌస్‌లో అసాంఘిక కార్యక్రమాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. అక్కడ క్యాసినో, కోళ్ల పందాలు, బెట్టింగులు జోరుగా సాగుతున్నట్లు తేలింది. 11 ఎకరాలున్న ఫామ్ హౌస్‌ను లీజుకు ఇచ్చారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఆయనకు గురువారం ఉదయం పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం కొత్త టర్న్ అయ్యింది.
సరిగ్గా మూడు రోజుల కిందట హైదరాబాద్ నగర శివారు మెయినాబాద్‌లోని పోచంపల్లి ఫామ్ హౌస్‌లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పెద్ద ఎత్తున క్యాసినో, కోడిపందాలు, బెట్టింగులు ఇంకా రకరకాల పనులు జరుగుతున్నట్లు తేలింది. అర్థరాత్రి సమయంలో పోలీసులు ఫామ్‌హౌస్‌పై సోదాలు చేశారు.
మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు 30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ కాయిన్స్, కోళ్లు పందాలకు సంబంధించిన కత్తులను సైతం స్వాధీనం చేశారు. చాలా మందిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. భూపతిరాజు, శివకుమార్ వర్మను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
ALSO READ: ఫ్యూచర్ ఏఐదే.. హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ ఇదొక మైలురాయి-సీఎం రేవంత్
ఈ వ్యవహారం వెనుక ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నుంచి నిర్వాహకులకు సహకారం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కోడి పందాలు నిర్వహించిన శివకుమార్‌కు బీఆర్ఎస్ పార్టీతో సన్నిహిత సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి.దీంతో లోతుగా విచారణ మొదలుపెట్టారు.
శివకుమార్ వాదన మరోలా ఉంది. ఎమ్మెల్సీ ఫామ్‌హౌస్ అని తనకు తెలియదన్నాడు. తమ బంధువు అక్కడ వాచ్ మేన్‌గా ఉండడంతో పందాలు నిర్వహించామని తెలిపాడు. దీంతో ఫామ్‌హౌస్‌లో ఏదో జరుగుతోందన్న చర్చ ఇంటబయట జోరందుకుంది. శివకుమార్ వర్మ, భూపతిరాజు ఆర్గనైజర్ కాగా, సుమన్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. సెలబ్రెటీలు, రాజకీయ నేతలతో ఫోటోలు దిగి వారంతా తనకు తెలుసని చెబుతున్నారట. మొత్తానికి 54 వాహనాలను సీజ్ చేశారు పోలీసులు.
కొన్నాళ్లుగా హైదరాబాద్ సిటీ చుట్టూ ఫామ్ హౌస్ కల్చర్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా మెయినాబాద్, శంషాబాద్, శంకర్ పల్లి, మేడ్చల్, శామీర్ పేట్, కీసర, ఘట్ కేసర్, ఇబ్రహీపట్నం ప్రాంతాల్లో 5 నుంచి 10 ఎకరాల భూములో ఫామ్ హౌస్ ఉంటున్నాయి. ఈ తరహా ఫామ్ హౌస్ లు గ్రేటర్ చుట్టూ దాదాపు 700 నుంచి 900 వరకు ఉన్నట్లు పోలీసుల అంచనా.
వీకెండ్ పార్టీలకు సంపన్నులతోపాటు సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. అక్కడ జరిగే రేవ్ పార్టీలకు హాజరవుతున్న సందర్భాలు లేకపోలేదు. అయితే కొందరు నిర్వాహకులు డబ్బుకు ఆశపడి అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించేందుకు రెంటుకు ఇస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి, డ్రగ్స్ వంటి తీసుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. వీటిని తీసుకోవడం నేరమని తెలిసినా, వాటికి ఫామ్ హౌస్ లను అడ్డాగా మార్చుకున్న విషయం తెల్సిందే. ఈ పోచంపల్లి ఫామ్ హౌస్ గురించి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.