CURE Bill: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రస్తుతం అమలవుతున్న 70 ఏళ్ల నాటి మున్సిపల్ చట్టం – 1959 స్థానంలో సర్కారు అమలు చేయాలనుకున్న క్యూర్ బిల్లుపై నేడు అసెంబ్లీలో చర్చించే అవకాశాలున్నాయి. మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో శనివారం 22ఏ భూములతో పాటు క్యూర్ బిల్లులపై చర్చించనున్నట్లు తెలిసింది. దశాబ్దాల క్రితం నాడు 15 లక్షల జనాభా అవసరాలకు, పరిపాలన సౌలభ్యం కోసం రూపకల్పన చేసిన మున్సిపల్ చట్టంలోని నిబంధనలు నేడు క్యూర్ లో పెరిగిన కోటి 30 లక్షల జనాభాకు సరిపోకపోవటంతోనే కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు సర్కారు క్యూర్ బిల్లును రూపొందించడం గమనార్హం.
గతేడాది నవంబర్ 25వ తేదీన కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలోకి విలీనం చేయాలని సర్కారు జారీ చేసిన ఆదేశాల మేరకు అతి వేగంగా విలీనం, ఆ తర్వాత ఫిబ్రవరి 11 నుంచి మూడు కార్పొరేషన్లుగా పునర్విభజించిన సంగతి తెలిసిందే. పారదర్శకమైన పాలన కోసం సర్కారు క్యూర్ బిల్లును రూపకల్పన చేసి గత ఆగస్టు నెల 5వ తేదీ నుంచి ఆన్ లైన్ లో ప్రజాభిప్రాయాలను సేకరించింది. ప్రజాభిప్రాయాల సేకరణకు విధించిన గడువు లోపు సుమారు 3,616 ప్రజాభిప్రాయాలను సేకరించారు. వీటిలో ఎక్కువ అభిప్రాయాలను సమర్పించిన వారు మున్సిపల్ ఉద్యోగులే ఉన్నట్లు కూడా తెలిసింది.
బిల్లులోని ఒకే ఒక్క నిబంధనపై ఏకంగా 2,500 ప్రజాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. క్యూర్ బిల్లులో పొందుపర్చిన నిబంధనల ప్రకారం కార్పొరేషన్ మేయర్ గానీ, కమిషనర్ గానీ తనకు కేటాయించిన అధికారాలను, కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేసినట్లు తెలిస్తే, ఈ వ్యవహారంపై వాస్తవాలను వెలికి తీసేందుకు ఓ స్పెషలాఫీసర్ ను నియమించనున్నట్లు కొత్త చట్టంలో నిబంధనను పొందుపర్చారు. అయితే ఈ స్పెషలాఫీసర్ ను ఏ విభాగం నుంచైనా నియమించాలని సర్కారు యోచించిన నిబంధను మార్చాలని అభిప్రాయాలు వచ్చాయి. సర్కారు నియమించాలనుకున్న స్పెషలాఫీసర్ మున్సిపల్ శాఖకు చెందిన వారై ఉండాలన్న అభిప్రాయాలను సమర్పించినట్లు తెలిసింది. ఈ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న సర్కార్.. క్యూర్ బిల్లులో స్వల్పంగా మార్పులు చేసి, అమలుకు సిద్దమైనట్లు తెలిసింది.
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనం చేయకముందు ఆ సంస్థ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ ను సబ్ రిజిస్ట్రార్ వ్యాల్యూ ప్రకారం విధించే వారు. అప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ ను రెంటల్ వ్యాల్యుూపై విధించి వసూలు చేసేవారు. కానీ కొత్త క్యూర్ బిల్లులోని నిబంధనల ప్రకారం మొత్తం జీహెచ్ఎంసీ తో పాటు కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మొత్తం మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో సబ్ రిజిస్ట్రార్ వ్యాల్యూ ప్రకారం ప్రాపర్టీ ట్యాక్స్ ను విధించనున్నారు. దీంతో కోర్ సిటీలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికిందరాబాద్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాదాపూర్, హైటెక్ సిటీ, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో భూములు ధరలు ఆకాశాన్ని తాకుతున్నందున సబ్ రిజిస్ట్రార్ వ్యాల్యూ ప్రకారం పన్నును సవరిస్తే చెల్లింపుదారులపై భారం పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రెంటల్ వ్యాల్యూ ఆధారంగా పన్ను చెల్లిస్తున్న వారు కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పన్నును రెండింతలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
ప్రస్తుతం క్యూర్ సిటీ పరిధిలో సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలు, లే ఔట్లలో ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటై, ఆశించిన స్థాయిలో మెరుగ్గా పని చేస్తున్న హైడ్రాకు క్యూర్ బిల్లు అమలుతో మరిన్ని అధికారాలు సమకూరే అవకాశాలున్నాయి. అంతేగాక ఈ బిల్లులో హైడ్రాకు చట్టబద్ధతను కూడా కల్పించనున్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణను చట్టబద్దతో హైడ్రాకు బాధ్యతలను అప్పగించనున్నారు. ఆహార భద్రత, విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్ కంట్రోల్, వారసత్వ సంపద పరిరక్షణ వంటి విధులు ఇతర సంస్థలు వేర్వేరుగా విధులు నిర్వర్తించనున్నాయి. అలాగే తాగునీటి సరఫరా, మురుగు నీటి బాధ్యతలను జలమండలికే అప్పగించనున్నారు. మున్ముందు అవసరాలకు తగిన విధంగా హైడ్రాకు సర్కారు అదనపు అధికారాలను కట్టబెట్టేలా ఈ బిల్లులో నిబంధనలను పొందుపరిచారు.
వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం క్యూర్ బిల్లు అమలుపై సీఎం అధ్యక్షతన అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ను కూడా నియమించనున్నట్లు తెలిసింది. దీనికి అనుబంధంగా ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ పనిచేయనుంది. ఇవి మూడు కార్పొరేషన్లను సమన్వయం చేస్తూనే, క్షేత్రస్థాయిలో పాలనా వికేంద్రీకరణను కొనసాగించనున్నాయి. మరోవైపు కాలం చెల్లిన ఎన్నికల అనర్హత నిబంధనలను సర్కారు ఈ బిల్లులో తొలగించింది. మున్సిపల్ సంస్థల్లో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్లకు ప్రాతినిధ్యం కల్పించాలని బిల్లులో ప్రతిపాదించడం ఒక విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు. ఇదే అంశంపై శుక్రవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టగా, చర్చ కూడా జరిగింది.
Also Read: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. దిక్కుతోచని స్థితిలో గులాబీ ఎమ్మెల్యేలు!
కౌన్సిల్ సమావేశం జరుగుతున్నపుడు దురుసుగా ప్రవర్తన, ఆస్తుల ధ్వంసం, బూతులు మాట్లాడటం వంటి చర్యలకు కౌన్సిల్ సభ్యులు మాట్లాడితే వారిని సస్సెండ్ చేసే అధికారం మేయర్, డిప్యూటీ మేయర్ కు ఈ బిల్లు ద్వారా సర్కార్ కల్పించనుంది. చట్టాన్ని ఉల్లంఘించినా, విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించినా కూడా సభ్యులను వివరణ కోరే పవర్ ను కల్పించనుంది. సభ్యుల వివరణ సంతృప్తి కరంగా లేని పక్షంలో పదవి నుంచి శాశ్వతంగా తొలగించే కీలకమైన పవర్ కూడా మేయర్, డిప్యూటీ మేయర్ కు ఈ బిల్లు ద్వారా లభించనుంది.