Maoist Rehabilitation: జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని డీజీపీ సీ.వీ.ఆనంద్ చెప్పారు. లొంగిపోయిన వారికి ఆర్థిక సాయం, ఆరోగ్య భద్రత, నివాస వసతి, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సాధారణ జీవితం గడిపేందుకు అండగా నిలుస్తోందన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సోమవారం లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం, తాత్కాలిక ఆర్థిక సహాయానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.
ఇందులో భాగంగా 214 మందికి 5 కోట్ల 59 లక్షల 50 వేల నగదు రివార్డులు, పునరావాస ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్చి 31 లక్ష్యానికి అనుగుణంగా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో భద్రతా బలగాలు చేపట్టిన చర్యలతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారన్నారు. జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల్లో లొంగుబాట్లు జరిగినట్టు తెలిపారు. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 824 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో తెలంగాణకు చెందినవారు 59 మంది, ఛత్తీస్ గఢ్ కు చెందినవారు 754 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 9మంది, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నట్టుగా వివరించారు.
లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ అవసరాల నిమిత్తం ఒక్కొక్కరికి 25 వేల చొప్పున తాత్కాలిక ఆర్థిక సాయం అందించామని డీజీపీ తెలిపారు. వారి ప్రభుత్వ రివార్డులకు అనుగుణంగా మిగిలిన ఆర్థిక సాయాన్ని దశలవారీగా అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 755 మందికి 22.31కోట్ల నగదు రివార్డులు మంజూరు చేయగా, వివిధ దశల్లో అందించిన సాయంతో కలిపి ఇప్పటివరకు జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులకు మొత్తం17 కోట్ల 68 లక్షల 35 వేల నగదు పంపిణీ చేసినట్టు వివరించారు. ఆధార్ కార్డులు లేకపోవడంతో పలువురికి బ్యాంకు ఖాతాలు తెరవడం ఇబ్బందిగా మారిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ఎస్‌ఐబీ అధికారులు ఛత్తీస్ గఢ్ పోలీసులతో సమన్వయం చేసుకుని బ్యాంకు ఖాతాల ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు.
లొంగిపోయిన వారికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు 59 ఆరోగ్య రక్షణ కార్డులు అందించామని డీజీపీ పేర్కొన్నారు. ఉచిత వైద్య చికిత్స అందించడంతోపాటు నిమ్స్, వారు ఉంటున్న ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రుల్లో అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నివాస వసతి కింద తెలంగాణకు చెందిన పది మందికి ఇళ్లు మంజూరు పూర్తికాగా, మరో 49 మందికి ఇళ్లు కల్పించనున్నట్టు చెప్పారు. కొంతమంది లొంగిపోయిన మావోయిస్టులు మారుమూల ప్రాంతాల్లో ఉండటం వల్ల పునరావాస సాయం అందించడంలో జాప్యం జరిగిందన్నారు. ఎస్‌ఐబీ అధికారులు నేరుగా వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. గత ఆగస్టులో వరంగల్ పర్యటన సందర్భంగా కూడా లొంగిపోయిన మావోయిస్టు కేడర్‌తో మాట్లాడి వారి అవసరాలు, ఆశయాలు తెలుసుకున్నానని వెల్లడించారు.
Also Read: రూ.899కే 50 గంటల బ్యాటరీ!ఫైర్-బోల్ట్ ఏరో ప్రో ఇయర్‌బడ్స్ ఫీచర్లు అదుర్స్
అడవుల్లో జీవించిన వారికి సాధారణ జనజీవనంపై అవగాహన కల్పించడంతోపాటు వారి అభిరుచులకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డీజీపీ చెప్పారు. కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వంటి వృత్తుల్లో నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఆటోలు, ట్రాక్టర్లు నడిపేందుకు డ్రైవింగ్ శిక్షణ కూడా కల్పిస్తామన్నారు. జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు వ్యక్తిగతంగా లొంగిపోయిన వారితో సంప్రదింపులు జరుపుతూ వారు తిరిగి తప్పుడు మార్గంలో వెళ్లకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన హక్కులు, పరిమితులకు లోబడి రాజకీయ, ప్రజా కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. అయితే మావోయిస్టు సిద్ధాంతాల ప్రచారాన్ని ప్రభుత్వం సహించబోదని తెలిపారు.
మావోయిస్టుల నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ వెల్లడించారు. 2026 నాటికి తెలంగాణ -ఛత్తీస్గడ్ సరిహద్దులోని కర్రగుట్ట ప్రాంతంలో మొత్తం తొమ్మిది ఆయుధాల డంపులు గుర్తించామన్నారు. వాటిలో 252 తుపాకులు, 359 బీజీఎల్ సెల్స్, నాలుగు ఎల్‌ఎంజీలు, 48 ఏకే-47 తుపాకులు లభించాయని తెలిపారు. కర్రెగుట్ట ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు, ల్యాండ్‌మైన్ లు ఉన్నాయన్నారు. సీఆర్పీఎఫ్, ఛత్తీస్ గఢ్ డీఆర్జీ బలగాల సమన్వయంతో ల్యాండ్ మైన్ లను జాగ్రత్తగా వెలికితీసి నిర్వీర్యం చేసే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం పర్యాటకులకు ఆ ప్రాంతంలో అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. ల్యాండ్ మైన్ ల తొలగింపు పూర్తయిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇంకా ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోవాల్సి ఉందని డీజీపీ తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితోపాటు మరో ఇద్దరు లొంగిపోయి సాధారణ జీవితం గడపాలని కోరారు. లొంగిపోయిన వారు తిరిగి మావోయిస్టు కార్యకలాపాల వైపు వెళ్లకుండా నిరంతర నిఘా, సంప్రదింపులు, పర్యవేక్షణ కొనసాగిస్తామన్నారు. గతంలో ఈ ప్రాంతాల్లో పాఠశాలలు, ఆస్పత్రుల గురించి కూడా తెలియని పరిస్థితులు ఉండేవన్నారు. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆ ప్రాంతాల్లో మార్పు వస్తోందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పది రాష్ట్రాల్లో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయని వివరించారు. గ్రేహౌండ్స్ లోని సిబ్బందిని అవసరాలకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించి, కొంతమందిని టీ-మార్స్, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ వంటి విభాగాలకు కేటాయించిన విషయాన్ని డీజీపీ గుర్తుచేశారు.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందిస్తున్న ఆర్థిక సాయం, పునరావాస సదుపాయాలను సద్వినియోగం చేసుకుని లొంగిపోయిన వారంతా చట్టబద్ధమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి గౌరవప్రదమైన జీవితం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు డీజీలు విజయ్‌కుమార్ (ఇంటెలిజెన్స్), అకున్ సబర్వాల్ (లా అండ్ ఆర్డర్), ఎస్పీ సీఐ సెల్ సింధు శర్మ , ఓఎస్డీలు దయానంద్, వేణుగోపాల్ ఎస్పీ రమేష్, అడిషనల్ ఎస్పీ శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Also Read: బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా నూడిల్స్ కట్లెట్! ఇంట్లోనే ఈజీగా చేయండిలా