Huzurabad Pensions: హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బడ్జెట్ కేటాయించి ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సోమవారం హుజురాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నియోజకవర్గంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్లలో 5,250 మంది వివిధ కారణాలతో తొలగించబడ్డారని, వాటి స్థానంలో ప్రభుత్వం కేవలం 4,221 మందికి మాత్రమే ఇచ్చి ఇంకా 1,029 పెన్షన్లను తగ్గించిందని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మండలాల వారీగా గణాంకాలను వివరిస్తూ.. హుజురాబాద్ మండలంలో 694 తొలగించి 603, జమ్మికుంట మండలంలో 644 తొలగించి 553, కమలాపూర్‌లో 1,425 తొలగించి 954, వీణవంకలో 744 తొలగించి 561, ఇల్లందకుంటలో 726 తొలగించి 428, జమ్మికుంట పట్టణంలో 577 ఫ్తొలగించి 582, హుజురాబాద్ పట్టణంలో 440 తొలగించి 540 పెన్షన్లు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ కేటాయించిన బడ్జెట్‌లో చనిపోయిన వారి స్థానంలో కొత్తవారికి ఇచ్చి, తామే కొత్త పెన్షన్లు ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం సరికాదన్నారు.
తన స్వగ్రామమైన వీణవంకలో 28 కొత్త పెన్షన్లు ఇచ్చామని కొందరు అంటున్నారని, వాస్తవానికి అక్కడ 73 పెన్షన్లు తొలగించి 28 మందికి మాత్రమే ఇచ్చారని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. వీణవంకలో 21 మంది వితంతువులకు 16 మందికి, 8 మంది ఒంటరి మహిళలకు ముగ్గురికి, 10 మంది గీత కార్మికులకు నలుగురికి మాత్రమే ఇచ్చారని విమర్శించారు. తాను చెప్పిన లెక్కల్లో ఏ ఒక్కటి తప్పని నిరూపించినా ముక్కు నేలకు రాస్తానని, ఈ అంశంపై వీణవంక గ్రామపంచాయతీ వద్ద బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి గానీ, జిల్లా మంత్రులు గానీ రావాలని ఆయన సవాల్ విసిరారు. హుజురాబాద్ పట్టణంలో అర్హత సాధించిన 800 మంది వృద్ధులకు పెన్షన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్నికల హామీ ప్రకారం రూ. 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని, 57 ఏళ్ల వయోపరిమితిని 70 ఏళ్లకు మార్చడం దారుణమన్నారు.
Also Read: అభిషేక్, వైభవ్, తిలక్ లాంటి వాళ్లు ఉన్నా చిత్తుగా ఓడించాం
ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు రూ. 10,000 కోట్లు కేటాయించుకున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా హుజురాబాద్ అభివృద్ధికి రూ. 1,000 కోట్లు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. నిధులు ఇవ్వకపోతే కాంగ్రెస్ నేతలను నియోజకవర్గంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన చారిత్రక దినం నవంబర్ 29న కరీంనగర్ అలుగునూర్ చౌరస్తా వద్ద కేటీఆర్ ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాలతో పాటు హుజురాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాలు, 2 పట్టణాలు (107 గ్రామపంచాయతీలు, 60 వార్డులు) నుండి బీఆర్ఎస్ శ్రేణులు, యువత, రైతులు, మహిళలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఈ నెల 25న ఉదయం 10 గంటలకు జమ్మికుంట సాయి గార్డెన్‌లో (జమ్మికుంట పట్టణం, మండలం, ఇల్లందకుంట), సాయంత్రం 3 గంటలకు వీణవంకలో, అలాగే 27న ఉదయం 10 గంటలకు హుజురాబాద్ క్యాంపు కార్యాలయంలో (హుజురాబాద్ పట్టణం, మండలం), సాయంత్రం 3 గంటలకు కమలాపూర్‌లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Also read: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి వర్సెస్ ఎంపీ వార్.. నలుగురు నేతలు సస్పెండ్?