CM Revanth Reddy: ఒకటి కాదు రెండు కాదు.. అక్షరాలా 46 ఏళ్ల నిరీక్షణ ఆ రైతుది. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని అనుకుంటూ అలాగే కాలం వెళ్లదీస్తున్నాడు ఆ రైతు. ఆ శుభ తరుణం రానే వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి పేరిట గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ రైతు నిరీక్షణకు శుభం కార్డు పడింది. ఇంతకు 46 ఏళ్లుగా కలగానే మిగిలిన ఆ రైతు కోరిక తీర్చింది ఎవరో తెలుసా.. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి.
అసలేం జరిగిందంటే..
నల్లగొండ జిల్లా నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం గ్రామానికి చెందిన కొమ్మనబోయిన పిచ్చయ్యకు సర్వే నెంబర్ 215/3లో ఒక ఎకరం భూమి ఉంది. ఆ భూమి మాత్రమే ఆయనకు ఆధారం. 1978లో పొందిన తన భూమి పట్టాదారు పాసు పుస్తకం కోసం పిచ్చయ్య నాటి నుండి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అలా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే పిచ్చయ్య పనిగా మారింది. భూమి గల రైతుకు పాస్ పుస్తకం ఉంటేనే అన్నీ పథకాలు వర్తిస్తాయి. కానీ పిచ్చయ్య ఓపిక కూడా నశించింది. ఇక తన భూమికి పాసు పుస్తకం దక్కడం కలే అనుకుంటూ పిచ్చయ్య ఆశలు వదులుకున్నారు.
ప్రజావాణితో 46 ఏళ్ల నిరీక్షణకు చెక్..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సీఎం రేవంత్ రెడ్డి, ప్రజావాణి పేరిట ప్రజా సమస్యలను తీర్చేందుకు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.. ప్రజల వినతులు స్వీకరించడం.. వాటిని పరిష్కరించడం. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రతి వినతి పరిష్కరించడంలో అధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు. అందుకే రోజురోజుకూ ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల వినతులు అధికసంఖ్యలో రావడం మొదలైంది. ఇలా ఎన్నో సమస్యలు పరిష్కారం కాగా, ప్రజావాణి ప్రజల మద్దతు కూడగట్టుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందన్న విషయం పిచ్చయ్యకు తెలిసింది. ఇన్నేళ్లు పాసు పుస్తకం కోసం తిరిగాను, ఈ ఒక్కసారి ప్రజావాణిలో తన సమస్యను విన్నవించుకుందామని పిచ్చయ్య భావించి, ఎట్టకేలకు అర్జీని గత జూలై నెలలో సమర్పించారు. ప్రజావాణిలో అర్జీ అందిందా.. ఆ అర్జీ స్టేటస్ ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు, ప్రత్యేక విభాగంను కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనితో పిచ్చయ్య పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసిన వంద రోజుల్లో సమస్య పరిష్కారమైంది. పిచ్చయ్య చెంతకు పాసు పుస్తకం చేరింది.
సీఎం గారూ.. థ్యాంక్స్ – పిచ్చయ్య
46 ఏళ్లుగా తిరగని కార్యాలయం లేదు, కలవని అధికారి లేడు కానీ ఇలా ప్రజావాణిలో అర్జీ ఇచ్చానో లేదో, నా పాసు పుస్తకం నాకు అందిందంటూ పిచ్చయ్య తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాసు పుస్తకం మంజూరైందని అధికారుల నుండి కబురు అందగానే, పిచ్చయ్య పండుగ వాతావరణంలా భావించి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారూ.. థ్యాంక్యూ సార్ అంటూ పిచ్చయ్య తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మొత్తం మీద ప్రతిపక్షాలు, ప్రభుత్వం పెట్టిన ప్రజావాణి పేరుకే అంటూ ఓ వైపు విమర్శలు చేస్తుండగా, ప్రజావాణిలో వచ్చిన ప్రతి అర్జీ పరిష్కార దిశగా చర్యలు తీసుకొనేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందనే దానికి ఉదాహరణగా పిచ్చయ్యకు 46 ఏళ్ల తర్వాత దక్కిన పాసు పుస్తకమే అంటున్నారు కాంగ్రెస్ నేతలు.