Trump Victory | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ భారీ విజయం సాధించింది. అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ కూడా చివరి దశలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కౌంటింగ్ పూర్తి అయ్యి ఫలితాలను వెల్లడించారు. ఇక ట్రంప్ విజయం దాదాపు లాంఛనం అయినట్టు తెలుస్తోంది. అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థి గెలవాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకోవాల్సి ఉంది. ఈ ఎలక్టోరల్ ఓట్లలో సైతం ట్రంప్ ముందంజలో ఉన్నారు. ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. హారిస్ 226 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. ట్రంప్ వర్గాలు సంబరాలు జరుపుతున్నాయి.
మరోవైపు ఏడు స్వింగ్ స్టేట్స్ ఫలితాలు కీలకంగా మారిన తరుణంలో. అన్నింటిలో రిపబ్లిక్ పార్టీ ఆధిక్యం కనబరిచింది. స్వింగ్స్ స్టేట్స్‌లో ట్రంప్‌నకు 58.2 శాతం ఓట్లు పోలవగా, హారిస్‌కు 41.3 శాతం ఓట్లు పోలయ్యాయి. పెన్సిల్వేనియా, జార్జియాలో కౌంటింగ్ పూర్తి అయింది. డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన మెజారిటీతో ఈ కీలక రాష్ట్రల్లో విజయం సాధించారు.
Also Read: Elon Musk US Elections Fraud: ఎలన్ మస్క్‌పై ఫ్రాడ్ కేసు.. రోజూ మిలయన్ డాలర్లు ఇస్తానని మోసం!
స్వింగ్ స్టేట్స్ గా పిలవబడే ఏడు అతిపెద్ద రాష్ట్రాలు.. నెవాడా, నార్త్ కెరోలీనా, పెన్సిల్ వేనియా, జార్జియా, మిచిగాన్, విస్ కాన్సిన్, ఆరిజోనాలలో రిపబ్లికన్లు సత్తా చాటారు. ఈ రాష్ట్రాలు గెలిచిన పార్టీలే ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు అమెరికా ఎన్నికల చరిత్ర చూస్తే తెలుస్తోంది. అమెరికా 47వ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఈ 7 రాష్ట్రాల్లో విజయమే ప్రధానం. దీంతో ఈసారి ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య హోరాహోరీ ఎన్నికల ప్రచారం సాగింది. కమలా హ్యారిస్ చర్చిలకు వెళ్లి ప్రచారం చేయగా.. ట్రంప్ పౌరులను ఆకర్షించడానికి ఒక సారి మెక్ డొనాల్డ్స్ లో వర్కర్ గా బర్గర్లు, పిజ్జాలు వండి కస్టమర్లకు వడ్డించారు. మరోసారి పారశుద్ధ్య కార్మికుడిగా చెత్త ట్రక్కులో ప్రచారం చేశారు.
ఇప్పుడు అన్ని స్వింగ్ రాష్ట్రాల ఎలక్టోరల్ ఓట్లు ట్రంప్ నకే లభించనడంతో ఆయన ప్రచార జిమ్మిక్కులు ఫలించాయని చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. దేశంలో దిగజారిన ఆర్థిక పరిస్థితులు, మహిళలకు అబార్షన్, బలహీనమైన ప్రజాస్వామ్య సమస్యలు అమెరికా ఎన్నికల్లో ప్రభావం చూపాయి. సిబిఎస్ న్యూస్ ప్రకారం.. సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మందిలో ఆరుగురు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ దిగజారిందని చెప్పారు. ప్రజలు రోడ్లపై వచ్చి నిరసన చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. మరోవైపు మహిళల అబార్షన్ అంశం చాలా సీరియస్ అని 5 శాతం ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ బలహీన పడిందని.. నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో సంపాదన సరిపోవడం లేదని పది శాతం మంది చెప్పారు.
మరోవైపు ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నకు అనుకూలంగా రావడంతో డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ బుధవారం ఎన్నికల తరువాత ఇవ్వదలుచుకున్న ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారు. హోవార్డ్ యూనివర్సిటీలో ఆమె ఎన్నికల ఫలితాల తరువాత తన పార్టీ గెలుపు సంబరాల్లో భాగంగా ప్రసంగ కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ కథ అడ్డం తిరగడంతో ఆమె కార్యక్రమం రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే డొనాల్డ్ ట్రంప్ తాను ఎన్నికల్లో విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు. అమెరికా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. దేశం కోసం, అమెరికా అభివృద్ధి కోసం పనిచేస్తానని చెబుతూ.. తనకు మద్దతుగా నిలిచిన తన భార్య మెలనియా, స్నేహితుడు బిలియనీర్ ఎలన్ మస్క్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రసంగంలో మాట్లాడుతూ.. మధ్యలో ఆగి మరీ తన భార్యను ముద్దాడారు.