Telangana Global Summit-2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2025 ద్వారా రేవంత్ సర్కార్‌తో భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు వ్యాపారవేత్తలు. రెండు రోజులకు కలిసి రూ.5,75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు కుదిరాయి. తొలిరోజు రూ.3,97,500 కోట్లకు ఒప్పందాలు చేసుకుంది ప్రభుత్వం. రెండోరోజు మంగళవారం రూ.1,77,500 కోట్లకు వివిధ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. వీటి ద్వారా మూడు ట్రిలియన్ల ఎకానమీ చేరుకోవడం కష్టమేమీ కాదు.
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 సక్సెస్
తెలంగాణకు భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో రూ.5,75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు కుదిరాయి. మొదటి రోజు సదస్సులో రూ.3,97,500 కోట్లకు ఒప్పందాలు కుదరగా.. రెండోరోజు మంగళవారం రూ.1,77,500 కోట్లకు ప్రభుత్వంతో వివిధ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఐటీ, విద్యుత్, క్రీడలు, పర్యాటకం, అటవీ వంటి రంగాల్లో పెట్టుబడులకు పలు కంపెనీలు ఆసక్తి చూపాయి. రెండు రోజుల గ్లోబల్ సదస్సులో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా లక్ష్యం విజయవంతమైంది. హైదరాబాద్‌లో జీసీసీని ప్రారంభించాలని కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకొచ్చారు.
ఇన్‌ఫ్రాకీ డీసీ పార్క్స్ ఏకంగా రూ. 70 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేసుకుంది. 150 ఎకరాల్లో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన ఏఐ రెడీ డేటా పార్క్ ఏర్పాటు చేస్తుంది. జేసీకే ఇన్‌ఫ్రా రూ.9 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. డేటా సెంటర్ విస్తరించడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల 2,000 మందికి ఉద్యోగాలు వస్తాయి.
భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు
తెలంగాణ పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. దీనివల్ల ప్రత్యక్షంగా 10 వేల మందికి ఉపాధి కలగనుంది. పరోక్షంగా మరో 30 వేల మందికి ఉపాధి లభించనుంది. ఏజీపీ గ్రూప్ తెలంగాణలో 125 ఎకరాల్లో ఒక గిగావాట్ హైపర్ స్కేల్ డీసీ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టంని అభివృద్ధి చేస్తుంది. అందుకోసం రూ. 6,750 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
బయలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీ కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్-మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. అందుకోసం రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. గ్రీన్ ఫార్మా సిటీలో 150 ఎకరాల స్థలం కేటాయించనుంది ప్రభుత్వం. 3,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
ALSO READ: ఓయూకు రావాలంటే ధైర్యం కాదు.. అభిమానం ఉండాలి-సీఎం రేవంత్‌రెడ్డి
ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో ఆహార, వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అల్యూలోజ్- గ్లైకైన్ బేస్‌డ్ ఇంగ్రేడియంట్స్, స్లో రిలీజ్ కార్బోహైడ్రేట్స్ వాటిని ఉత్పత్తి చేయనుంది. అందుకోసం ప్రత్యేకంగా యూనిట్‌ను ప్రారంభించనుంది. ఇందుకోసం రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రానున్న రెండేళ్లలో ఆయా ప్రాజెక్టుల ద్వారా 800 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 100 ఎకరాల భూమి కేటాయించనుంది.
అరబిందో ఫార్మా.. జనరిక్ ఔషధాలు, ఇంజెక్టబుల్స్, బయో సిమిలర్ ఔషధాలను ఉత్పత్తి చేసే యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ఆ సంస్థ రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. రాబోయే మూడేళ్లలో 3,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
హెటిరో గ్రూప్..రాష్ట్రంలో ఫార్మా యూనిట్లను నెలకొల్పనుంది. అందుకోసం రూ.1,800 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ సంస్థకు ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించనుంది. 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్.. ఆహార ఉత్పత్తుల తయారీకి కొత్త యూనిట్‌ను ప్రారంభించనుంది. తొలి విడత రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనిద్వారా 1,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ సంస్థకు 100 ఎకరాలు ప్రభుత్వం కేటాయించనుంది.
గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీ.. క్యాన్సర్ ఔషధాల ఉత్పత్తి చేయనుంది. రూ.1,200 కోట్ల పెట్టుబడితో కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. తద్వారా సుమారు 3,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
వింటేజ్ కాఫీ అండ్ బెవరేజ్ లిమిటెడ్.. ప్రీమియం ఫ్రీజ్ డ్రైడ్ ఇన్‌స్టెంట్ కాఫీ ఉత్పత్తుల యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. కేవలం ఎగుమతుల కోసం మాత్రమే. రూ.1,100 కోట్ల పెట్టుబడి రానుంది. 15 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. 1,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
భారత్ బయోటెక్.. కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టడమేకాదు.. 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
కేజేఎస్ ఇండియా కంపెనీ రూ.650 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఆహార పానీయాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. రెండేళ్లలో 1,551 మందికి ఉద్యోగాలు రానున్నాయి. 44 ఎకరాల భూమి కేటాయించింది ప్రభుత్వం.
బయోవరం కంపెనీ.. రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఆ గ్రూప్ ఛైర్మన్ వరప్రసాద్‌రెడ్డి ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. టిష్యూ ఇంజినీరింగ్, బయో మెటీరియల్స్, రీజనరేటివ్ మెడిసిన్, కణ జన్యు చికిత్స ఏర్పాటు చేయనుంది. 200 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా అవకాశాలు లభించనున్నాయి.
గోద్రెజ్ గ్రూప్.. రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. పాడి పరిశ్రమ విస్తరణకు ఈ పెట్టుబడి పెట్టనుంది. దీనిద్వారా రానున్న రెండేళ్లలో 300 ఉద్యోగాలు కల్పించనుంది. ఆ సంస్థకు 40 ఎకరాల భూమి కేటాయించింది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ యానిమేషన్ సంస్థ, ఐఐఎఫ్‌ఏ ఉత్సవ్ అండ్ ఏథెన్స్ ఈవెంట్స్ రూ.550-600 కోట్లు పెట్టనుంది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ.. రూ.500 కోట్లతో జహీరాబాద్‌లోని యూనిట్‌ను విస్తరించనుంది. కొత్తగా ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు తయారు చేయనుంది.
టీడబ్ల్యూఐ గ్రూప్ రూ.1,100 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. డ్రీమ్‌వాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్.. రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. సారస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ మెంట్ చేయనుంది. ఫుడ్‌లింక్ ఎఫ్ అండ్ బి హోల్డింగ్స్ ఇండియా కంపెనీ . రూ.3,000 కోట్లు, ఆర్‌సీటీ ఎనర్జీ ఇండియా సంస్థ. మూడు దశల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 1,600 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.
అట్మాస్పియర్ కోర్ హోటల్స్-మాల్దీవులు కంపెనీ రూ.800 కోట్లు, ఆర్‌సీటీ ఎనర్జీ ఇండియా కంపెనీ మూడు దశల్లో రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. పోలిన్ గ్రూప్(టర్కీ) రూ.300 కోట్లు, ఫ్లూయిడ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(స్పెయిన్) రూ.300 కోట్లు, శ్రీ హవిషా హాస్పిటాలిటీ అండ్ ఇన్‌ఫ్రా.. రూ.300 కోట్లు, కేఈఐ గ్రూప్ అండ్ అసోసియేట్స్(కామినేని గ్రూప్).. రూ.200 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇవికాకుండా ఇంకా చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి. ఓవరాల్‌గా పరిశీలిస్తే రెండురోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలని అంటున్నారు కొందరు నిపుణులు.