Hyderabad: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రూటు మార్చింది. యువతీయువకుల మంచి చదువులు, ఉద్యోగాల గురించే కాదు.. వారి తల్లిదండ్రులపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లల జీతంలో కోత విధించేలా విధివిధానాలు రెడీ చేసింది.
వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్‌ని పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు రెడీ అయ్యింది తెలంగాణ ప్రభుత్వం. ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసింది. వీటికి సంబంధించి విధివిధానాలను సీనియర్ సిటిజన్ల సంక్షేమశాఖ ఖరారు చేసింది. ప్రభుత్వ ఆమోదం కోసం వాటిని పంపింది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం, ఉద్యోగి జీతం నుంచి ప్రతీ నెల 15 శాతం లేకుంటే రూ.10 వేలు కోత విధించే అవకాశం ఉంది.
రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు.. దత్తత తీసుకున్న లేకుంటే తమ తల్లిదండ్రులను పట్టించుకోకుంటే వారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక అథారిటీని సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. కాకపోతే తల్లిదండ్రులు తమ జీవనానికి సరిపడా ఆదాయం లేదని చూపించాలి. వివిధ మార్గాల ద్వారా నెలకు అందుతున్న ఆదాయం, ఉద్యోగులైన పిల్లల నుంచి ఇప్పటి వరకు అందిన ఆర్థిక సహాయానికి సంబంధించిన ఆధారాలను ఇవ్వాలి.
కొత్త చట్టం కింద హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఐదు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందినట్లు తెలుస్తోంది.
ALSO READ: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్ షాక్.. వచ్చే మంగళవారం కోర్టులో హాజరుకావాల్సిందే!