HYDRAA Commissioner: తెలంగాణ హైకోర్టులో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు సమన్లను పట్టించుకోకుండా విచారణకు హాజరుకాకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రంగనాథ్ , శంషాబాద్ తహసీల్దార్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు ఏకంగా కొట్టివేయడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మంగళవారం కోర్టులో హాజరుకావాల్సిందే
కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ విచారణకు గైర్హాజరు కావడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. వచ్చే మంగళవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కోర్టులో హాజరుపర్చాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించగా.. శంషాబాద్ తహసీల్దార్‌ను సకాలంలో ప్రవేశపెట్టాలని సైబరాబాద్ సీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
విచారణపై సర్వత్రా ఉత్కంఠ..
న్యాయస్థానం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. చట్టం ముందు అందరూ సమానులే అనే సందేశాన్ని ఈ పరిణామం మరోసారి స్పష్టం చేస్తోంది. రానున్న మంగళవారం నాటి కోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read: నాగార్జునతో కలిసి తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేకతలు ఇవే!