Telangana Govt: ఈ ఒక్క కార్డు లేకుంటే ఏ పథకం అందదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకం వర్తించాలంటే, ఈ కార్డు ఉండాల్సిందే. అందుకే సామాన్య కుటుంబాలకు ఈ కార్డు ఒక వరం. అయితే ఇటీవల కొందరు చేస్తున్న తప్పిదాలకు రేషన్ కార్డులను కూడా రద్దు చేసే రోజులు వచ్చాయి. దీనితో ఆయా కుటుంబాలు సంక్షేమ పథకాలు దూరమేనని చెప్పవచ్చు. మరెందుకు ఆలస్యం.. ఆ తప్పిదం ఏమిటో తెలుసుకుందాం. మనం చేయకుండా జాగ్రత్త వహిద్దాం.
రేషన్ కార్డు ఉంటే చాలు..
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నూతన రేషన్ కార్డుల జారీకి చర్యలు తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. అయితే అర్హులైన అందరికీ మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ దశలోనే ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ మేలు చేకూర్చే మరో నిర్ణయం తీసుకుంది. ఉగాది నుండి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ఏ రాష్ట్రంలో లేని విధంగా అమలు చేస్తోంది. ఈ నిర్ణయంపై యావత్ తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సంపన్న కుటుంబాలకే పరిమితమైన సన్నబియ్యంను సామాన్య ప్రజలకు అందించడం గొప్ప నిర్ణయమని ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశంసించారు.
సన్నబియ్యం సరే.. ఇదేంటి?
తెలంగాణలో రేషన్ బియ్యం అమ్మకం ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా స్పందించింది. బియ్యం అమ్మకం నిర్ధారితమైతే, సంబంధిత కుటుంబానికి రేషన్ కార్డు రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలకు నిత్యావసరంగా ఇచ్చే సబ్సిడీ బియ్యాన్ని మార్కెట్‌లో అక్రమంగా విక్రయిస్తే ఎంత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నది ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది.
ఇతరుల పేర్లపై కార్డులు, బ్లాక్ మార్కెట్ కు బియ్యం
ఇటీవల ఇంటెలిజెన్స్ శాఖ నివేదికల ప్రకారం, కొన్ని మండలాల్లో నకిలీ రేషన్ కార్డులు, ఇతరుల పేర్లపై బియ్యం తీసుకొని మార్కెట్‌లో అమ్ముతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని చోట్ల అయితే కార్డుదారులే ప్రభుత్వ బియ్యం అమ్మి ప్రైవేట్ బ్రాండెడ్ బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమేనని అధికారులు చెబుతున్నారు. ఇటీవల మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం ఆచలాపూర్ లో 11 రేషన్ కార్డులను అధికారులు రద్దు చేశారు. ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని కేజీ రూ. 16 ల చొప్పున విక్రయించినట్లు గుర్తించి చర్యలు తీసుకున్నారు.
Also Read: Bhubharati Revenue Conferences: తెలంగాణలోని 28 మండలాలకు బిగ్ అలర్ట్.. ఇప్పుడే ఛాన్స్..
రేషన్ కార్డు రద్దయితే..
అక్రమంగా సన్నబియ్యాన్ని విక్రయిస్తే కార్డు రద్దు కావడం ఖాయం. అందుకే కార్డు రద్దు వరకు లబ్దిదారులు తీసుకు వెల్లవద్దన్నది ప్రభుత్వ వాదన. కార్డు ఒక్కసారి రద్దయితే సామాన్య కుటుంబాలకు జరిగే నష్టం ఊహకు అందదు. ఏ ప్రభుత్వ పథకం వర్తించదు. అప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే లబ్దికి మనం దూరం కావడమే. అందుకే ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యాన్ని పక్కదారి పట్టకుండా చూడాల్సిన భాద్యత రేషన్ కార్డుదారులపై ఉంది. మరి మీ పరిధిలో ఎవరైనా రేషన్ ను అక్రమంగా విక్రయిస్తుంటే, వెంటనే అధికారులకు తెలియజేయండి. అలాగే కార్డు రద్దుపై అవగాహన కల్పించండి.