Bhubharati Revenue Conferences: తెలంగాణలోని ఆ మండలాల ప్రజలు అప్రమత్తం కావాల్సిందే. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన మీ భూ సమస్యలను ఇప్పుడే పరిష్కరించుకోండి. లేకుంటే ఇంకా కొన్నేళ్లు అలా కాలం వెళ్లదీయాల్సిందే. ఔను.. మీకోసమే తెలంగాణ సర్కార్ ఒక ప్రకటన జారీ చేసింది. భూభారతి చట్టాన్ని దశల వారీగా అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ఏమిటంటే..
మీకు భూ సమస్య ఉందా?
రాష్ట్ర భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో భూభారతి చట్టాన్ని అమలులోకి తెచ్చారు. అలా చట్టం తెచ్చారో లేదో, ఇలా దరఖాస్తుల వెల్లువ సాగుతోంది. భూమినే నమ్ముకున్న ప్రజలకు భూభారతి చట్టం ఓ వరమని ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఈ చట్టానికి రాష్ట్ర ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అయితే దశల వారీగా ప్రభుత్వం ఈ చట్టాన్ని ఆయా జిల్లాలలో అమలు చేస్తోంది.
మంత్రి పొంగులేటి మాట..
ప్రజాకోణంలో తీసుకువచ్చిన ఈ భూభారతి చట్టంపై ప్రజల్లో విస్తృత స్ధాయిలో అవగాహన కల్పించడంతో పాటు, భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించడమే భూభారతి రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి కలెక్టర్ రెవెన్యూ సదస్సులకు హాజరై అక్కడ రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్ధమయ్యే భాషలో వివరించి పరిష్కారం చూపాలని చెప్పారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఎంతో అధ్యయనంతో తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని క్షేత్ర స్థాయికి సమర్థంగా తీసుకెళ్లాలని కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 5 నుండి 28 మండలాల్లో..
తెలంగాణ భూ పరిపాలనలో నూతన అధ్యాయానికి నాంది పలికిన భూభారతి చట్టాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపిన విషయం తెల్సిందే. గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని జిల్లాకొక మండలం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తాజాగా ప్రకటన వెల్లడైంది.
సమస్య మీది.. పరిష్కారం ప్రభుత్వానిది
తెలంగాణ సమాజంలో భూమి కీలకమైన అంశం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వందల కుటుంబాలు భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఒక కుట్రపూరితంగా, దురుద్ధేశ్యంతో తీసుకొచ్చిన ధరణితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ధరణితో ప్రజల జీవితాలను ఆగమాగం చేసిందని కాంగ్రెస్ అంటోంది. ఎన్నో రైతు కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని, గత ప్రభుత్వ పెద్దలే ధరణి దందాలకు అండదండలుగా నిలిచారన్నది కాంగ్రెస్ ఆరోపణ.
ప్రజల ఆలోచనలకు భిన్నంగా గత పదేండ్లలో రాష్ట్రంలో భూ హక్కుల విధ్వంసం జరిగిందని, రైతులకు రెవెన్యూ సేవలు దుర్భరంగా మారాయని ప్రభుత్వ వాదన. సీఎం రేవంత్ రెడ్డి సలహాలు, సూచనలు, ఆలోచనలకు అనుగుణంగా రైతు కళ్లల్లో ఆనందం చూడాలనే సంకల్పంతో భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. చట్టాన్ని తీసుకురావడం ఒక ఎత్తు కాగా దానిని అమలు చేయడం మరో ఎత్తు. ఇందిరమ్మ ప్రభుత్వంలో అధికార యంత్రాంగం రైతుల దగ్గరకు వచ్చి వారి సమస్యను పరిష్కరించనుంది. మరెందుకు ఆలస్యం మీ భూసమస్య ఇప్పుడే మీ గ్రామంలో జరిగే రెవిన్యూ సదస్సుకు వివరించండి.
Also Read: Pakistan civil war: పాకిస్తాన్ లో భీకర కాల్పులు.. అంతా భయం భయం.. ఇప్పుడెలా ఉందంటే?
5 నుండి ఇక్కడే గ్రామసభలు..
భూ భారతి అమలవుతున్న 28 మండలాల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఈ సంధర్భంగా ఆయా జాబితాను ప్రకటించింది. ఆదిలాబాద్ – భరోజ్, భద్రాద్రి కొత్తగూడెం – సుజాతనగర్, హనుమకొండ – నడికుడ, జగిత్యాల – బుగ్గారం, జనగాం – ఘన్‌పూర్, జయశంకర్ భూపాలపల్లి – రేగొండ, జోగులాంబ గద్వాల్ – ఇటిక్యాల్, కరీంనగర్ – సైదాపూర్, కొమరంభీం ఆసిఫాబాద్ – పెంచికల్‌పేట్, మహబూబాబాద్ – దంతాలపల్లె, మహబూబ్ నగర్ – మూసాపేట్, మంచిర్యాల – భీమారం, మెదక్ – చిల్పిచిడ్, మేడ్చల్ మల్కాజిగిరి – కీసర, నాగర్‌కర్నూల్ – పెంట్లవల్లి, నల్గొండ – నక్రేకల్, నిర్మల్ – కుంతాల, నిజామాబాద్ – మెండోరా, పెద్దపల్లి – ఎలిగేడ్, రాజన్న సిరిసిల్ల – రుద్రంగి, రంగారెడ్డి – కుందుర్గ్, సంగారెడ్డి – కొండాపూర్, సిద్దిపేట – అక్కన్నపేట, సూర్యాపేట – గరిడేపల్లె, వికారాబాద్ – ధరూర్, వనపర్తి – గోపాలపేట, వరంగల్ – వర్దన్నపేట్, యాదాద్రి భువనగిరి – ఆత్మకూర్ మండలాల్లో భూభారతి రెవిన్యూ సదస్సులు జరగనున్నాయి.