TG Rythu Bharosa Scheme: రైతులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రైతు భరోసా పథకం కింద నాలుగు ఎకరాలు, అంతకంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. దీనిపై ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. మరోవారంలో రోజుల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.
తెలంగాణలో లక్షలాది మంది రైతులకు శుభవార్త చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు భరోసా స్కీమ్ కింద పెట్టుబడి సాయంగా 3.5 ఎకరాలు కలిగిన రైతులకు మాత్రమే లభించేది. దీనికి సంబంధించి కొత్త విషయాన్ని వెల్లడించారు సదరు మంత్రి. 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నట్లు తెలిపారు.
కేవలం 10 రోజుల్లో వారి బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు జమ చేస్తామని వెల్లడించారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ తరహా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు చెప్పినట్టే. మధ్య తరహా రైతులకు ఇదొక ఉపశమనం అన్నమాట. కొంతమంది రైతులు ఈ స్కీమ్ పరిధిలోకి రాకపోవడం వల్ల అసంతృప్తి నెలకొంది.
మంత్రి ప్రకటనతో ఆ లోటు భర్తీ కానుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గణనీయమైన ఒత్తిడిలో ఉన్నా రైతుల సంక్షేమం విషయంలో వెనుకడుగు వేయడం లేదన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావడం, బిల్లుల భారం, పాత అప్పుల చెల్లింపులు సమస్యలు ఉన్నాయన్నారు. రైతులకు నిరంతర ఆదరణ ఇవ్వాలనే ఆలోచనతో రైతు భరోసా పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
ALSO READ: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 51 కోట్ల నిధులు విడుదల
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు హామీ ఇచ్చింది. దాని ప్రకారం ఎకరాకు రూ.15,000 చొప్పున పెట్టుబడి సాయం అందించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధుకు బదులుగా ‘రైతు భరోసా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల ఏడాదికి రూ.12,000 చొప్పున నిధులు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచన.
ఈ మొత్తాన్ని రెండు విడతలుగా అంటే ఖరీఫ్-రబీ రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. మూడున్నర ఎకరాల కలిగిన రైతులకు రూ.4,000 కోట్లు జమ చేసింది. కొత్తగా పరిమితి పెంపుతో లక్షలాది మంది రైతులు లబ్దిదారులుగా మారనున్నారు.
మార్కెట్‌లో ఆయిల్ పామ్‌కు గణనీయమైన డిమాండ్ ఉందని, రైతులు ఈ తరహా సాగును ప్రోత్సహించేందుకు కసరత్తు మొదలుపెట్టింది ప్రభుత్వం. పెట్టుబడి సాయం ద్వారా రైతులకు కొంత రిలీఫ్. అప్పుల భారం నుండి ఉపశమనం కూడా. రైతులను ప్రోత్సాహించడమే కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు దోహదపడుతుందన్నారు మంత్రి.