Land Revision: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూ సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సర్కారు ప్రతిపాదించిన హెచ్ సిటీ ప్రాజెక్టు పనులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో రవాణా మెరుగు, రాకపోకలు మరింత వేగంగా కదిలేందుకు వీలుగా ప్రతిపాదించిన ప్రాజెక్టులకు స్థల సేకరణ ఆశించిన స్థాయిలో జరగకపోవటం, పైగా సేకరించనున్న స్థల సేకరణకు రెండింతలు ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్ (టీడీఆర్) లు ఇచ్చేందుకు సర్కారు సిద్దమైనా, స్థల యజమానులు ససేమిరా అనటంతో హెచ్ సిటీ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ముందుకు సాగకపోవటం, భూముల ధరలను సవరించాలని తరుచూ ప్రజల నుంచి అభ్యర్థనలు, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సిఫార్సులు కూడా రావటంతో భూముల ధరలను సవరించేందుకు సర్కారు సిద్దమైంది.
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రేట్ల సవరణకు అనుకూలంగా నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. భూముల మార్కెట్ విలువల్లో భారీగా హెచ్చుతగ్గులున్నట్లు గుర్తించిన సర్కారు, మొత్తం మార్కెట్ విలువలను రేష్నలైజేషన్ చేయాలని మంత్రి వర్గ సమావేశంలో రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించినట్లు తెలిసింది. వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న స్థలాల యజమానులు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారం రేట్లపై, జారీ చేస్తున్న ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్స్ (టీడీఆర్)లపై అసంతృప్తితో ఉన్నట్లు సర్కారు గుర్తించింది. దీంతో పాటు వాస్తవంగా మార్కెట్ లో ఉన్న ధరలతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన భూముల ధరలు భారీగా వ్యత్యాసాలున్నట్లు కూడా గుర్తించింది. అందుకు శాస్త్రీయ పద్ధతిని అనుసరించి ఈ ధరలను సవరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపటంతో జిల్లాల్లో ఉండే మార్కెట్ విలువల రివిజన్ కమిటీలు ఈ విషయంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.
Also Read: అధికారుల దొంగ రిపోర్టులకు ఇక చెక్.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!
కేబీఆర్ పార్కు చుట్టూ రూ. 1090 కోట్లతో హెచ్ సిటీ కింద ఏర్పాటు చేయనున్న ఏడు అండర్ పాస్ లు, మరో ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లకు స్థల సేకరణ జీహెచ్ఎంసీకి ఓ సవాలుగా మారింది. స్థల సేకరణ విషయంలో నేరుగా కమిషనర్ కర్ణన్ ప్రత్యేక చొరవ చూపినా, స్థలాలిచ్చేందుకు యజమానులు ముందుకు రావటం లేదని తెల్సింది. జీహెచ్ఎంసీలో నిధుల్లేనందున ఆకర్షనీయంగా ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్స్ (టీడీఆర్)లు ఇచ్చే స్థలాలు సేకరించేందుకు స్థల యజమానులతో కమిషనర్ కర్ణన్ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించినా, స్థల యజమానులు ముందుకు రావటం లేదని తెలిసింది. హెచ్ సిటీ పనులకు సంబంధించి ఇప్పటి వరకు అరడజను సార్లు సీఎం వద్ద సమీక్షలు నిర్వహించిన సమయంలోనూ స్థల సేకరణకు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ఉన్నతాధికారులు సర్కారు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఒక్క హైదరాబాద్ జిల్లా నుంచే గాక, ఇతర జిల్లాల్లోనూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల స్థల సేకరణకు అనేక రకాల అడ్డంకులు సమీక్షలో ప్రస్తావనకు రావటంతో, సేకరించనున్న భూమికి రెండింత రేట్లు కట్టి టీడీఆర్ లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నా, యజమానులు స్థలాలిచ్చేందుకు ముందుకు రాకపోవటంతో భూముల మార్కెట్ విలువను సవరించేందుకు సర్కారు సిద్దమైనట్లు తెలిసింది.
రిజిస్ట్రేషన్ శాఖ ప్రస్తుతమున్న భూముల మార్కెట్ విలువలను సవరించే పనిలో నిమగ్నమై ఉంది. ఈ ప్రక్రియ పూర్తయి, మరో పక్షం రోజుల్లో జిల్లాల వారీగా భూముల ధర సవరణపై క్లారిటీ రావటంతో పాటు వెంటనే అమల్లోకి తేవాలని సర్కారు భావిస్తుంది. దీంతో కేబీఆర్ పార్కు చుట్టూ పెండింగ్ లో ఉన్న స్థల సేకరణ వచ్చే నెల మొదటి వారం నుంచే వేగవంతం కానున్నట్లు జీహెచ్ఎంసీ అధికారవర్గాలు భావిస్తున్నాయి. స్థలాలిచ్చే యజమానులు సంతృప్తి చెందేలా ఈ మార్కెట్ విలువల సవరణ ఉండనున్నట్లు అధికారవర్గాల సమాచారం.
ఒక్క కేబీఆర్ పార్కు చుట్టున్న ఏడు జంక్షన్లలో సుమారు 453 ఆస్తుల నుంచి దాదాపు రూ. 741 కోట్లను వెచ్చించి స్థల సేకరణ చేయనున్నారు. అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ లో 45 ఆస్తులు, అలాగే పిల్మ్ నగర్ జంక్షన్ లో 43, రోడ్ నెం.45 జంక్షన్ లో 40, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్ లో మరో 73, కేబీఆర్ పార్కు, ముగ్దా జంక్షన్ లో 61, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ లో 21, అగ్రసేన్ మహారాజ్ విగ్రహాం నుంచి రోడ్ నెం. 12 జంక్షన్ లోనున్న రోడ్డును 100 అడుగుల రోడ్డుగా విస్తరించేందుకు దాదాపు 170 ఆస్తులతో కలిపి మొత్తం 453 ఆస్తుల నుంచి స్థలాలను సేకరించేందుకు ఈ నష్టపరిహారం అంచనా వ్యయం సుమారు రూ.741 కోట్లుగా ఆరేళ్ల క్రితం నిర్ణయించగా, త్వరలో పెరగనున్న భూముల మార్కెట్ విలువ ధరలతో స్థల సేకరణ వ్యయం మరింత పెరిగే అవకాశాలున్నట్లు అధికారవర్గాల సమాచారం.