Congress vs BRS: తెలంగాణలో ఒక రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. సభ వాయిదా తర్వాత మీడియా పాయింట్‌లో ఒకరిపై మరొకరు నేతలు విమర్శలు గుప్పించారు. బీసీలపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు.
సకల జనుల సర్వే అంటూ ఒక రోజు రిపోర్టును అటకెక్కించిన ఘనత ఆ పార్టీ నేతలకు చెల్లుతుందన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం గురించి వారు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 56 శాతం బీసీలు ఉన్నారని, వాళ్ళ మాదిరిగా తాము నివేదికలు దాచి పెట్టలేదని కుండబద్దలు కొట్టేశారు.
స్పీకర్‌కు ఉన్న అధికారంతో సభను వాయిదా వేయడం తప్పా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. గత బీఆర్ఎస్ పాలనలో బీసీ రిజర్వేషన్లు తగ్గించి మీరు కాదా అంటూ మండిపడ్డారు. మా ప్రభుత్వం మీకు మాదిరిగా కాదని, సభలో హరీష్‌రావు, గంగులకు మాట్లాడే సమయం కేటాయిస్తామన్నారు. మీరు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పాలన్నారు.
బీఆర్ఎస్ పాలనలో 51 శాతం బీసీలుంటే ఇప్పుడు మరో ఐదు శాతం పెరిగిందన్నారు. బీసీల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాభిమానం పెరుగుతుందని నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజా పాలనలో భాగంగా కుల గణన చేశామని గుర్తు చేశారు.
ALSO READ: కేసీఆర్.. సమగ్ర సర్వే వివరాలెక్కడ? సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నోరు విప్పారు. కుల గణన చేశామని కారు పార్టీ నేతలు జీర్ణించుకోలేక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. హరీష్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీసీ రిజర్వేషన్లు తగ్గించింది గత ప్రభుత్వం కాదా అంటూ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు తగ్గించడం వలన ఎంతో మంది అవకాశాలు కోల్పోయిన విషయం మీకు తెలీదా?
సభలో మాట్లాడే దమ్ము, ధైర్యం లేక ఈ విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్ళు బీసీలకు రాజకీయ పరంగా అవకాశాలు కల్పించలేదన్నారు. ఎవరో ఏదో రకంగా మీడియా ముందు ఈ విధంగా మాట్లాడడం సరికాదన్నారు. శాసన మండలి, శాసనసభల్లో చర్చల్లో పాల్గొనాలని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు విప్ శ్రీనివాస్.