CM Revanth Reddy: దేశ చరిత్రలో మొదటిసారి కులగణన చేసి తాము చరిత్ర సృష్టించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్ చాట్ గా సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమగ్ర సర్వేను నిర్వహించారని, ఆ వివరాలను మాజీ సీఎం కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు సంబంధించిన నివేదికలు కూడా ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతతో పనిచేసి సర్వేను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు.
కేసీఆర్ కుటుంబం ఏ పని చేసినా చిత్తశుద్ధి లేకుండానే ముందుకు సాగిందని, రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ కుటుంబం సర్వేపై కూడా విమర్శలు చేస్తున్నారన్నారు. తమ కులగణన సర్వే ద్వారా 56% మంది బీసీలు, 17 శాతం మంది ఎస్సీలు రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వర్గీకరణ జరగాలని ఎప్పటి నుండో మాదిగ, మాలలు పోరాటం చేస్తున్నారని సీఎం అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు, కమిషన్ నివేదిక, సబ్ కమిటీ నివేదిక సూచన ప్రకారం తాము ముందుకెళ్తామని సీఎం సూచనప్రాయంగా తెలిపారు.
భవిష్యత్తులో ఏ సర్వే జరిగినా తాము నిర్వహించిన కులగణన సర్వేను ప్రామాణికంగా తీసుకోవాలని, దేశ చరిత్రలో మొదటిసారి కులగణన పూర్తి చేసి చరిత్ర సృష్టించామని తెలిపారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. తాము ఇక్కడ రాజకీయాల కోసం ఏది చేయడం లేదని కేవలం రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతున్నామన్నారు. 88 జనరల్ సీట్లలో బీసీలకు తాము 30 సీట్లు కేటాయించామని, 33 శాతం వారికే కేటాయించామన్నారు.
ఈరోజు దేశ చరిత్రలో నిలిచిపోతుందని, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సర్వేతో .. ప్రధాని నరేంద్ర మోడీపై ఒత్తిడి పెరిగిందన్నారు. అన్ని రాష్ట్రాలలో కులగణన చేయాలనే డిమాండ్ రానుందని, భవిష్యత్తులో తాము ప్రవేశపెట్టే డాక్యుమెంట్ రిఫరెన్స్ తీసుకోవాలన్నారు. 2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ తమ ప్రభుత్వమే కులగణన సర్వే చేసిందన్నారు. 2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్ళే చెప్పాలని అసెంబ్లీకి రానివారు అసెంబ్లీ సమయం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కొందరు ఉపఎన్నికల గురించి మాట్లాడుతున్నారని, సిరిసిల్లలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాల కోసం కేటీఆర్ సూసైడ్ చేసుకుంటారేమోనని సీఎం చెప్పడం విశేషం.
Also Read: Fire Accident: ఫ్లైఓవర్ పై కారు.. ఒక్కసారిగా మంటలు.. అసలేం జరిగిందంటే?
ఇదిఇలా ఉంటే.. నిన్న పార్లమెంట్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కులగణన సర్వేను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ద్వార, కులగణన సర్వే వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది.