తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అలాగే ఉంచండి
ఎన్‌కౌంటర్ పరిణామాలు, పంచనామాపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వండి
మిగిలిన ఆరుగురి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించండి
ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ
పోస్టుమార్టం సరిగా జరగలేదంటూ పిటిషన్
తదుపరి విచారణ గురువారానికి వాయిదా
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏటూరునాగారం ఎన్‌కౌంటర్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సల్స్ మరణించిన విషయం తెలిసిందే. అయితే తన భర్త మల్లయ్య మృతదేహానికి పంచనామా సరిగా జరగలేదని, డెడ్‌బాడీపై కాలిన గాయాలు ఉన్నాయంటూ కే.ఐలమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషనర్, ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మల్లయ్య మృతదేహాన్ని భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది.
ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పరిణామాలు, పంచనామాపై సమగ్ర నివేదిక సమర్పించాలన్న న్యాయస్థానం ఆదేశించింది. మిగతా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే మావోయిస్టుల మృతదేహాలను భద్రపరిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతదేహాలకు నిబంధనల ప్రకారమే పోస్టుమార్టం నిర్వహించామన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్, హైకోర్టు ఆదేశాల అనుసారమే పంచనామా ప్రక్రియ పూర్తి చేశామని, 8 మంది వైద్య నిపుణులతో ఈ ప్రక్రియ పూర్తి చేశామని హైకోర్టుకు గవర్నమెంట్ ప్లీడర్ తెలిపారు. దీంతో పోస్టుమార్గం సమద్ర నివేదికను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.
Also Read: బీజేపీ, బీఆర్ఎస్.. రాజకీయ తోడు దొంగలు: చనగాని దయాకర్
కాగా ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలకు సోమవారమే పోస్టుమార్టం జరిగింది. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగాధిపతి ప్రొఫెసర్ సీహెచ్.లక్ష్మణ్‌రావు, ప్రొఫెసర్ ఖాజామొయినుద్దీన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సురేందర్, నవీన్, పీజీ వైద్యులు మాధురి, మౌనిక, జితేందర్, నవీన్, జూనియర్ వైద్యులు ప్రియాంక, ఫరేఖ, లావణ్య, తరుణ్, ప్రశాంత్ కలిసి శవపంచనామా నిర్వహించారు. ఏటూరునాగారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.సురేష్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. సోమవారం మధ్యహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పోస్టుమార్టం జరిగింది. కాగా మావోయిస్టులపై విష ప్రయోగం జరిగిందని పౌరహక్కుల సంఘం ఆరోపణ చేస్తోంది.