E-Paper
Advertisement

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.46,250 సబ్సిడీ..!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.46,250 సబ్సిడీ..!
Advertisement

Horticulture: స్వేచ్చ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేసుకుని ఈఏడాది సుమారు రూ.1,000 కోట్లతో ఉద్యాన పంటల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. శాసనసభలో బుధవారం ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్ సాగుపై మంత్రి మాట్లాడారు. ఫామ్‌పాండ్ల ఏర్పాటుకు కూడా సబ్సిడీ అందిస్తున్నామని, ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు ఉచితంగా ఫామ్‌పాండ్లు తవ్వుకునే అవకాశం ఉందన్నారు.

వరి తో పోలిస్తే..

వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవాలని రైతులకు సూచించారు. ఆయిల్‌పామ్ పంట వరి తో పోలిస్తే తక్కువ నీరు అవసరమవుతుంది, మొక్క నాటిన తర్వాత సుమారు 40ఏళ్ల వరకు దిగుబడి అందించే అవకాశం ఉన్నందున రైతులు ఈ పంట వైపు దృష్టి సారించాలని మంత్రి కోరారు.

2026–27 ఆర్థిక సంవత్సరంలో..

Advertisement

రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఉద్యాన పంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో వివిధ పథకాల కింద అదనంగా 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని,పండ్లు, కూరగాయలు, ఆయిల్‌పామ్ తదితర పంటల వైపు రైతులను మళ్లించేందుకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

రూ.261 కోట్లు కేటాయింపు..

ఉద్యాన పంటల సాగు విస్తరణకు అవసరమైన మొక్కలు, ఎరువులు, మల్చింగ్, షేడ్‌నెట్, ఫామ్‌పాండ్లు, శీతల గిడ్డంగులు, శాశ్వత పందిళ్లు, బిందు, తుంపర సేద్యం వంటి సదుపాయాలను నిబంధనల ప్రకారం 40 శాతం నుంచి 90 శాతం వరకు రాయితీపై అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. 2026–27లో మొక్కలు, మల్చింగ్, షేడ్‌నెట్, కోత అనంతర నిర్వహణ సదుపాయాలు, శీతల గిడ్డంగులు, ఉద్యాన యాంత్రీకరణ, శాశ్వత పందిళ్ల కోసం రూ.150 కోట్లు, బిందు, తుంపర సేద్యం కోసం రూ.243 కోట్లు, ఆయిల్‌పామ్ అభివృద్ధికి రూ.261 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

Advertisement

Also read: సీఎం రేవంత్ వ్యాఖ్యల వెనుక ఉన్న మతలబిదే.. బండి సంజయ్ క్లారిటీ!

ఎన్ఎంఈఓ ఓపీ పథకం..

రాష్ట్రంలో ప్రస్తుతం 88,282 మంది రైతులు 3.20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఎన్ఎంఈఓ ఓపీ పథకం కింద 2021–22 నుంచి ఇప్పటివరకు 2.74 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టి తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 2023 డిసెంబర్ నుంచి 1.37 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును విస్తరించామని చెప్పారు. 2026–27 సంవత్సరానికి 85 వేల ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 29,053 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు మంత్రి వెల్లడించారు.రైతులను ఆయిల్‌పామ్ సాగు వైపు ప్రోత్సహించేందుకు మొక్కలు, డ్రిప్, మొదటి నాలుగేళ్లకు ఎరువులు, అంతర పంటల సాగు తదితరాలకు కలిపి ఎకరానికి రూ.46,250 వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు.

నాలుగు మిల్లులు..

ఫామ్‌పాండ్లు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను కూడా రాయితీపై అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్ గెలలకు టన్నుకు రూ.24,025 ధర ఉందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ మిల్లులు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో అశ్వారావుపేట, అప్పారావుపేట, నర్మెట్టలో, గోద్రెజ్ ఆధ్వర్యంలో అంజనాపురంలో మిల్లులు పనిచేస్తున్నాయని చెప్పారు. మరో ఆరు మిల్లుల నిర్మాణ పనులు కల్లూరుగూడెం, ఇంచెర్ల, పెద్దరాతు, రేగొండ/చిన్నపాక, యాచారం, శంకరంరెడ్డిపల్లి ప్రాంతాల్లో కొనసాగుతున్నాయని, వచ్చే ఏడాదికి ఇవి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

హార్వెస్టింగ్ దశ..

సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో రిఫైనరీ, ఆధునిక ప్యాకేజింగ్ కేంద్రం ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. మిల్లుల ఏర్పాటుకు అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. ఒక ఫ్యాక్టరీ నిరంతరాయంగా పనిచేయాలంటే కనీసం 10 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట హార్వెస్టింగ్ దశకు రావాల్సి ఉంటుందని వివరించారు. ఇప్పటికే పలు ఫ్యాక్టరీలకు అనుమతులు ఇచ్చి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, అన్ని ఉమ్మడి జిల్లాల్లో మిల్లుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఆరు నెలల్లో..

ములుగు, భూపాలపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే ఫ్యాక్టరీల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించామని, జనగామ, మహబూబాబాద్ ప్రాంతాల్లో కూడా ఆయిల్‌పామ్ సాగు విస్తరిస్తున్నందున అక్కడ అదనపు ప్రాసెసింగ్ సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆరు నెలల్లో ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కనీసం 10–15 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరించేలా రైతులను ప్రోత్సహిస్తే అక్కడే ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.

Also read: జాన్వీ, ఖుషీలకు నోటీసులు.. శ్రీదేవి ఆస్తి వివాదంలో సుప్రీం కీలక ఆదేశం

Tags

Related News

హుజూరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో గురుకుల విద్యార్థులు కలకలం

మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డాక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ విలీనం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!

మీ ఫోన్ పోగొట్టుకున్నారా.. వెంటనే ఇలా చేయండి.. సీక్రెట్స్ చెప్పిన సైబరాబాద్ సీపీ?

సీఎం రేవంత్ వ్యాఖ్యల వెనుక ఉన్న మతలబిదే.. బండి సంజయ్ క్లారిటీ!

అక్రమ భవనాలు కూలడానికి అసలు కారణం ఇదే.. హైడ్రా కమిషనర్ క్లారిటీ!

వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు పిల్లలు మృతి!

Big Stories

Advertisement
×