Phone Tapping Case: కారు పార్టీకి ఈ ఏడాది కలిసిరావడం లేదా? ఒకదాని తర్వాత మరొక సమస్య ఆ పార్టీని వెంటాడుతోందా? కాళేశ్వరం కమిషన్ నోటీసుతో ఉక్కిరి బిక్కిరి అవుతోందా? ఇంకో వైపు కవిత లేఖ ఆ పార్టీలో కాక రేపుతోందా? తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపో మాపో కీలక నిందితుడు ప్రభాకర్‌రావు భారత్‌కు రానున్నారా? ఆయన వస్తే బీఆర్ఎస్‌కు మరిన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
భారత్ కు ప్రభాకర్‌రావు!
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడి ప్రభాకర్‌రావును ఇండియాకు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇప్పటికే భారత్ పంపిన రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియ ప్రారంభించింది అమెరికా ప్రభుత్వం.
ప్రభాకర్‌రావును అమెరికా నుండి భారత్ తరలించేందుకు అక్కడి హోం ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు ఇక్కడి అధికారులకు సమాచారం అందింది. ప్రభాకర్‌రావును రాజకీయ శరణార్థిగా గుర్తించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ అక్రమాలను అక్కడి ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపిందట దర్యాప్తు బృందం.
ఏ క్షణంలోనైనా ప్రభాకర్‌రావు ఇండియాకు వచ్చే అవకాశముందని అంటున్నారు. 60 ఏళ్ల దాటిన వారిని ట్రంప్ సర్కార్ వారి దేశాలకు తరలిస్తోంది. ఆ లెక్కన చూసినా ప్రభాకర్‌రావు వీలైనంత త్వరగా భారత్‌కు రావడం ఖాయమని కొందరు అధికారుల మాట. అయితే ఈ వారం లేకుంటే వచ్చేవారంలో రావచ్చని అంటున్నారు. జూన్ 20న హాజరుకావాలని నాంపల్లి కోర్టు ప్రభాకర్‌రావుకు ఆదేశాలు జారీ చేసింది కూడా.
ALSO READ: రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్, జూన్ రెండు నుంచి
బీఆర్ఎస్‌కు కష్టాలు తప్పవా?
ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విషయానికి వద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక వ్యక్తి ప్రభాకర్‌రావు. ఆయన చెప్పినట్టే తాము చేశామని మిగతా నిందితులు విచారణలో పేర్కొన్నారు. అంతకుమించి తమకు ఏమీ తెలీదని చెప్పారు. ఆ విషయాలను ఛార్జిషీటులో పొందుపరిచారు విచారణ అధికారులు. ఆయన వస్తే ట్యాపింగ్ గుట్టు వీడనుంది.
ఇప్పుడు ప్రభాకర్‌రావు చుట్టూనే ఈ కేసు తిరుగుతోంది. మరి ఆయన అసలు నిజాలు బయటపెడతారా? అదే జరిగితే అప్పటి ప్రభుత్వంలోని పెద్దల మెడకు ఉచ్చు బిగిసుకోవడం ఖాయం. అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవని అంటున్నారు. ఓ వైపు పార్టీలో అంతర్గత కలహాలు, మరోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ప్రభాకర్‌రావు వంతు కానుంది.
ఈ కేసులో ఆయనను ఏ-1గా చేర్చారు అధికారులు. ఏడాదిన్నర కిందట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేయగానే మూడో కంటికి తెలియకుండా అమెరికాకు చెక్కేశారు ప్రభాకర్‌రావు. ఏడాదిన్నర నుంచి తప్పించుకునే తిరుగుతున్నాడు. అక్కడి నుంచి ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. ఆయనకు ఎక్కడా ఉపశమనం లభించలేదు. జూన్ 20లోగా హాజరుకావాలని న్యాయస్థానం జారీ చేసిన నోటీసులను ఆయన నివాసానికి అంటించారు అధికారులు.