World Fittest Old Man| ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం ప్రజలు చిన్న సమస్యలకే భయపడిపోతుంటారు. కానీ కొందరు మాత్రం ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ ఆదర్శంగా నిలబడతారు. ఈ రెండో కోవకు చెందినవారిలో ఒకరు 102 ఏళ్ల మైక్ ఫ్రీమాంట్.
ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన 102 ఏళ్ల మైక్ ఫ్రీమాంట్ ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవాడు. 60 ఏళ్ల వయసులో క్యాన్సర్ వచ్చినా, డాక్టర్లు “మూడు నెలలకు మించి బతకవు” అని చెప్పినప్పటికీ, ఆయన క్యాన్సర్ తో పోరాడి 102 ఏళ్ల వరకు ఆరోగ్యంగా బతికాడు. అంతేకాదు, మారథాన్‌లలో అనేక ప్రపంచ రికార్డులు సృష్టించాడు. 80 ఏళ్లలో, 90 ఏళ్లలో, 91, 96 ఏళ్ల వయసులో వేగంగా మారథాన్ పూర్తి చేసిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. హాఫ్ మారథాన్, కనోయింగ్ (బోటింగ్) వంటి క్రీడల్లో కూడా రికార్డులు సాధించాడు.
అయితే ఇవన్నీ ఎలా సాధించాడు అని అందరూ ఆశ్యర్యంగా చూస్తున్నారు. ఆయన దీర్ఘాయుష్షు రహస్యం ఏమిటి? ఎలా ఇన్నేళ్లు ఆరోగ్యంగా జీవించగలిగాడు? అని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు.
మైక్‌కి 60 ఏళ్ల వయసులో క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆర్థరైటిస్ (ఎముకల బలహీనత) సమస్య కూడా ఉంది. అయినా, అతను ఆరోగ్యంపై దృష్టి పెట్టాడు. క్యాన్సర్‌ను అధిగమించే ఆహారాల గురించి తెలుసుకున్నాడు. అలా, ఆయన మాంసాహారం మానేసి పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం మాత్రమే తినడం అలవర్చుకున్నాడు. తాజా కూరగాయలు, ఓట్‌మీల్, బ్లూబెర్రీస్, బీన్స్, బ్రోకలీ, పండ్లు వంటివి తీసుకునేవాడు. రెండున్నర సంవత్సరాల తర్వాత వైద్య పరీక్షల్లో అతని శరీరంలో క్యాన్సర్ కణాలు లేవని తేలింది. అప్పుడు ఆయనకు ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యత తెలిసింది.
ఒత్తిడికి దూరంగా ఉండడానికే మైక్ ప్రాధాన్యత ఇచ్చాడు. “ఒత్తిడి మనల్ని మరణానికి దగ్గర చేస్తుంది,” అని అతను అంటాడు. అందుకే ప్రశాంతమైన జీవనశైలిని ఎంచుకున్నాడు. వ్యాయామం కూడా అతని జీవితంలో ముఖ్యమైన భాగం. మునుపు వారానికి మూడు సార్లు 10 మైళ్లు పరిగెత్తేవాడు. ఇప్పుడు వయసు మీద పడటంతో 5 మైళ్లకు తగ్గించాడు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో కనోయింగ్ (బోటింగ్) వంటి క్రీడలు చేస్తాడు, ఇది వ్యాయామంతో పాటు ఆనందాన్ని కూడా ఇస్తుంది.
Also Read: యువకుడి తలపై పెద్ద కాక్రోచ్.. తొలగించడానికి వెళ్లిన యువతికి షాక్.. అది సామాన్యమైనది కాదు
మైక్ జీవితంలో దుఃఖాలు కూడా ఉన్నాయి. ఆయన మొదటి భార్య ప్రసవ సమయంలో రక్తస్రావం కారణంగా చనిపోయింది. ఆ ఒంటరితనాన్ని అధిగమించేందుకు 36 ఏళ్ల వయసులో పరుగు ప్రారంభించాడు. అలాగే, ఆయన తల్లిదండ్రులు క్యాన్సర్, గుండెపోటు వల్ల మరణించారు. ఈ అనుభవాలు ఆయనను కఠినంగా ఆహారం, వ్యాయామంలో మార్పులు చేసుకునేలా ప్రేరేపించాయి.
మైక్ పర్యావరణ కార్యకర్తగా ఉంటూ దాని పరిరక్షణకు కూడా కృషి చేస్తాడు. “కాలుష్య రహిత భూమిని భవిష్యత్ తరాలకు అందించాలని” అనేదే ఆయన లక్ష్యం. ఈ ఆకాంక్ష ఆయనను ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించేలా చేసింది. అంతేకాదు, స్నేహితులతో కలిసి మారథాన్‌లలో పాల్గొంటాడు, వృద్ధుల క్లబ్ లో సభ్యుడిగా ఉంటూ అందరితో స్నేహంగా ఉంటాడు. భార్య, బంధువులతో సమయం గడుపుతాడు. “మంచి సంబంధాలు మనల్ని ఎక్కువ కాలం జీవించేలా చేస్తాయి,” అనేది మైక్ అభిప్రాయం.