Telangana Police: స్వేచ్ఛ బ్యూరో: బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని అందరు పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా పకడ్భంధీ చర్యలు తీసుకోవాలని చెప్పారు. పశువుల రవాణా విషయంలో 1977 కౌ స్లాటర్ యాక్ట్, 1978 ట్రాన్స్పోర్ట్ యాక్ట్, 1960 ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టీ యాక్ట్ లను అమలు చేయాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో 52 అంతరాష్ట్ర చెక్ పోస్టులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని, ముఖ్యంగా రానున్న 15 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే పశువుల సంతలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. చెక్ పోస్టుల వద్ద పశువుల రవాణాకు సంబంధించిన ‘ఫిట్ టు ట్రాన్స్‌పోర్టేషన్’, ‘ఫిట్ టు స్లాటర్’ వంటి ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పారు.
Also Read: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇంటి వద్దకే వచ్చి పెన్షన్..?
పశువుల రవాణా విషయంలో ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ చెప్పారు. ఏదైనా అనుమానం ఉన్నా…సమాచారం ఉన్నా పోలీసులకు అందించాలన్నారు. తప్పితే రోడ్ల మీదకు వచ్చి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించ వద్దని ఖురేషీలు, గోరక్షక బృందాలకు సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయటంతోపాటు సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు రెండు వర్గాల వారితో విడివిడిగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని చెప్పారు.
పోలీస్, మున్సిపల్, పశుసంవర్ధక, రెవెన్యూ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని డీజీపీ చెప్పారు. దీని కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకొని సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకోవాలని సూచించారు. సీజ్ చేసిన పశువులను సంరక్షించేందుకు తగిన విస్తీర్ణంలో క్యాటిల్ పాండ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ పశువులకు అవసరమైన సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు. అలాగే సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. గందరగోళం సృష్టించేలా పోస్టులు పెట్టే వారిని స్టేషన్లకు పిలిపించి హెచ్చరించాలన్నారు. ఎంఏయుడీ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు అప్రమత్తతో ఉన్నారని చెప్పారు. కౌ స్లాటర్ యాక్ట్ , ట్రాన్స్పోర్ట్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ చట్టాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. పశుసంవర్ధక శాఖ సెక్రెటరీ ఇలంబర్తి మాట్లాడుతూ పశువుల రవాణాకు సంబంధించిన సర్టిఫికెట్లను ఇచ్చేందుకు వెటర్నరీ డాక్టర్లను అందుబాటులో ఉంచామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపి, అదనపు డీజీపీ మహేశ్ భగవత్, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ ఖాసిం, కార్తికేయ, ఇంటెలిజెన్స్ డీఐజీ భాస్కరన్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: తెలంగాణ విద్యుత్ సంస్థల్లో.. ఆస్తుల విభజనకు రంగం సిద్ధం!