Telangana RTC: అసలే టెక్ యుగం.. క్షణం వేస్టు చేయకుండా తీరికలేకుండా గడుపుతోంది యువత. వీలు చిక్కినప్పుడల్లా స్మార్ట్మ్ ఫోన్ పట్టుకుని తమకు తెలిసిన సమాచారం వెతికే పనిలో పడుతోంది. రైల్వేస్టేషన్లు, బస్సు స్టేషన్లు, చివరకు ప్రయాణం చేసే సమయంలో తమకు కావాల్సిన సమాచారం కోసం కంటిన్యూ సెర్చింగ్ చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ఆర్టీసీ, బస్సుల్లో ఉచితంగా వైఫై పెట్టాలని భావిస్తోంది.
తెలంగాణ ఆర్టీసీ కేవలం ఆదాయం పెంచుకోవడమే కాదు.. ప్రయాణికుల సౌకర్యాలపై ప్రధానం దృష్టి పెడుతోంది. మహాలక్ష్మి పథకం వల్ల మహిళలకు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. బస్సులు చాలకపోవడంతో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. అయినా రద్దీ అలాగే కొనసాగుతోంది.
తాజాగా కొత్త నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. బస్సుల్లో వైఫై సదుపాయం కల్పించేందుకు ప్లాన్ చేస్తోంది ఆర్టీసీ. దూరం ప్రాంతాలకు వెళ్లే లహరి ఏసీ బస్సుల్లో ఉన్న ఈ సదుపాయాన్ని మిగతా బస్సులు, బస్టాండ్లకు విస్తరించాలని ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలో జరిగే సమావేశంలో దీనిపై క్లారిటీ రానుంది.
రైల్వేస్టేషన్లలో ఇప్పటికే ఉచితంగా వైఫై సదుపాయం ఉంది. రైలు ఏ స్టేషన్‌లో ఆగినా ప్రయాణికుడికి రెడీగా వైఫై అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఇదే తరహాగా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ.
ALSO READ: బనకచర్ల ఇష్యూపై కేసీఆర్ ను ఉరితీయాలి.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఒకవేళ ఉచితంగా వైఫై సదుపాయం కల్పిస్తే.. బస్సుల్లో ప్రవేశపెట్టాలా? ఏ తరహా బస్సులు? సిటీ బస్సులకు ఆ అవకాశం ఉంటుందా? లేకుంటే బస్సు కాంప్లెక్సుల్లో పెట్టాలా? అనేదానిపై రకరకాలుగా మంతనాలు చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ నుంచి ఉచిత వైఫైకి సంబంధించిన ప్రతిపాదనలు అందినట్టు తెలుస్తోంది.
మంగళవారం సచివాలయంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సదరు ప్రైవేట్ సంస్థ మంత్రికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. బస్సులు, బస్టాండ్లు, రవాణాశాఖ కార్యాలయాల్లో వై ఫై సదుపాయాన్ని అందిస్తామన్నది అందులోకి కీలక పాయింట్.
ఇంటర్నెట్ యాక్సెస్‌తో కూడిన వై ఫై కాకుండా, అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ను వైఫై ద్వారా మొబైల్ ఫోన్లలో అవకాశం కల్పించనుంది. ప్రయాణికులు ఎంపిక చేసుకున్న సినిమాలు, పాటల చూడొచ్చన్న మాట. కంటెంట్ మధ్యలో కమర్షియల్ యాడ్స్ కూడా వస్తాయని దానివల్ల ప్రైవేట్ సంస్థకు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ వర్గాల మాట.
ప్రస్తుతం లహరి ఏసీ బస్సుల్లో ఉచిత వైఫై విధానం అమల్లో ఉంది. మిగతా బస్సులు, బస్టాండ్లలో ఈ సదుపాయాన్ని విస్తరించాలన్నది సదరు సంస్థ ప్లాన్. దీనిపై ఆర్టీసీ అధికారుల మరో సమావేశం నిర్వహించే అవకాశముందని అంటున్నారు. ఆ తర్వాత వైఫై సదుపాయంపై స్పష్టత రావచ్చు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులు మరింత ఆహ్లాదకరంగా జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనిద్వారా ఆర్టీసీకి అదనపు ఆదాయ మార్గాలు లభించే అవకాశం ఉంది.