Tgsrtc conductor notification 2026: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అవకాశాన్ని ఇస్తోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ కండక్టర్ కొలువుల భర్తీకి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. మొత్తం 1,500 కండక్టర్ పోస్టులను భర్తీ చేసుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం పదో తరగతి పాసైన అర్హతతోనే, ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే వీలుండటం విశేషం. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, టీజీఎన్ఆర్టీసీ సంస్థలో ఇప్పటివరకు కండక్టర్ పోస్టుల భర్తీ కోసం ఎలాంటి అధికారిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రాలేదు. ప్రతి సంవత్సరం వందలాది మంది పాత ఉద్యోగులు పదవీ విరమణ పొందుతుండటంతో డిపోలలో సిబ్బంది కొరత తీవ్రమైంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆర్టీసీ యాజమాన్యం గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి ప్రధాన రీజియన్లలో తాత్కాలికంగా అవుట్‌సోర్సింగ్ పద్ధతిపై కండక్టర్లను తీసుకుంది. అయితే.. ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన 1,500 ఖాళీలను డైరెక్ట్‌గా భర్తీ చేసేందుకు వీలు కలగడంతో అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు.
ఎంపిక:
సాధారణంగా ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలకు అభ్యర్థుల టెన్త్ మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు. జిల్లాల వారీగా ఉన్న ఖాళీలు, అలాగే ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థుల మెరిట్ లిస్ట్ రూపొందించి నేరుగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
మార్కుల వర్సెస్ గ్రేడింగ్:
ప్రస్తుతం ఈ రిక్రూట్‌మెంట్‌కు ఒక చిన్న ఇబ్బంది వచ్చి పడింది. పాత బ్యాచ్ అభ్యర్థులకు పదో తరగతిలో మార్కుల శాతం ఉండగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాచ్‌లకు ఎస్సెస్సీ బోర్డు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసింది. మళ్లీ ఇప్పుడు విద్యాశాఖ గ్రేడింగ్ తీసేసి మార్కుల విధానాన్ని తెచ్చింది. దీనివల్ల అప్లై చేసుకునే వారిలో కొందరికి జీపీఏ పాయింట్లు, మరికొందరికి మార్కులు ఉండే పరిస్థితి ఏర్పడింది.
ఈ రెండు వేర్వేరు విధానాల అభ్యర్థులను ఒకే తాటిపైకి తెచ్చి మెరిట్ లిస్ట్ ఎలా తయారు చేయాలనే దానిపై ఆర్టీసీ అధికారులు తలమునకలవుతున్నారు. గ్రేడింగ్‌ను కచ్చితమైన మార్కుల శాతంలోకి మార్చేందుకు ఒక స్పష్టమైన గైడ్‌లైన్ ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ సంస్థ తాజాగా ఎస్సెస్సీ బోర్డుకు ఒక లేఖ రాసింది.
టెన్త్ గ్రేడింగ్, మార్కుల శాతానికి సంబంధించిన ఫార్ములాపై ఎస్సెస్సీ బోర్డు నుంచి క్లారిటీ రాగానే, టీజీఎన్ఆర్టీసీ అధికారికంగా నోటిఫికేషన్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా కేవలం అకడమిక్ మెరిట్ ద్వారానే ప్రభుత్వ ఉద్యోగం సాధించే ఛాన్స్ కాబట్టి, అర్హులైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.