Telangana Education: స్వేచ్ఛ బ్యూరో: బడ్జెట్ కేటాయింపుల పెంపు.. ఉపాధ్యాయులు నియామకం.. పదోన్నతులు.. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా కల్పిస్తున్న మౌలిక వసతులు.. అన్నింటికి మించి విద్యా రంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ విద్యా రంగం జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పర్ఫామెన్స్ గ్రేడ్ ఇండెక్స్ 2.0లో తెలంగాణ ముందుకు దూసుకు వచ్చింది.
పీజీఐలో 1000 స్కోరుకు గానూ తెలంగాణ స్కోరు 2024-25లో 552.5గా ఉండగా 2025-26లో అది 599.7కి చేరుకుంది. ఫలితంగా గతంలో 31 స్థానంలో నిలిచిన రాష్ట్రం ఇప్పుడు అయిదు స్థానాలు అధిగమించి 26వ స్థానానికి చేరుకుంది. గతంలో ఆకాంక్షి-1 విభాగంలో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం ప్రచేష్ట-3లోకి చేరుకుంది. విద్యా ప్రమాణాలు పెరగడంతో గతంలో ఉన్న స్థానం కంటే కనీసం ఒక్కో స్థానాన్ని జిల్లాలు మెరుగుపర్చుకున్నాయి. ఈ గ్రేడింగ్‌లో ఏ జిల్లా కూడా గతం కంటే తక్కువ స్థానానికి పడిపోలేదు. ప్రతి పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన జరగడమే ప్రస్తుత ర్యాంకింగ్ పెరగడానికి కారణమైంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో జనగాం, మంచిర్యాల వరుసగా 383, 360 స్కోరుతో ఉత్తమ్-3 విభాగంలో నిలిచాయి.
రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం 10,006 ఉపాధ్యాయ నియామకాలు చేపట్టింది. డీఎస్సీ-2008కి చెందిన 1,382 మందిని కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా నియమించింది. పదేళ్ల పాటు విస్మరించిన ఉపాధ్యాయ శిక్షణను పునఃప్రారంభించింది. 1,12,882 మంది ఉపాధ్యాయులు, 1,16,084 మంది ప్రధానోపాధ్యాయులకు వేసవిలో అయిదు రోజుల చొప్పున శిక్షణ ఇచ్చారు. 2018 తర్వాత 2024, జూన్‌లో 34,706 మంది ఉపాధ్యాయులకు బదిలీలను చేపట్టింది. వివిధ కేడర్లలోని 25,950 మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది.
Also read: Delhi: వాహన యజమానులకు శుభవార్త, తెరపైకి కొత్త ప్రతిపాదనలు, ఇకపై మూడేళ్లు
ప్రభుత్వ పాఠశాలల్లోని మూడో తరగతి విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కంటే మెరుగైన ప్రతిభ కనపర్చారు. మూడో తరగతి విభాగంలో తెలంగాణ ర్యాంకు గతంలో 31 స్థానంలో నిలిచిన రాష్ట్రం ఇప్పుడు ఐదు స్థానాలు అధిగమించి 26 వ స్థానం ప్లేసులో గతంలో 28 వ స్థానం నుంచి పది స్థానాలు అధిగమించి 18 వ స్థానానికి చేరుకుంది. రాష్ట్రంలోని 495 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 283 విద్యాలయాలు ఇప్పటికే ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ కాగా 2025–26 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మరో 120 కేజీబీవీలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేసింది. 93 కేజీబీవీలను యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా గుర్తించి ఇంజినీరింగ్, మెడిసిన్, న్యాయ విద్య ప్రవేశ పరీక్షలకు విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఫలితాల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం తెలుగులో 9 శాతం నుంచి 35 శాతానికి, ఇంగ్లిష్‌లో 4 శాతం నుంచి 29 శాతానికి, ఉర్దూలో 19 శాతం నుంచి 40 శాతానికి, గణితంలో 18 శాతం నుంచి 30 శాతానికి పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏక్‌స్టెప్ ఏఎక్స్‌ఎల్–ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాన్ని 1,354 పాఠశాలల్లో అమలు చేస్తూ 15,848 మంది విద్యార్థులకు చదవడం, అవగాహన చేసుకోవడం, అంకెలు, సంఖ్యా పరిజ్ఞానంలో శిక్షణ ఇస్తోంది. ఫిజిక్స్‌వాలా ఉచిత డిజిటల్ కోచింగ్‌ను 194 మోడల్ స్కూళ్లు, 495 కేజీబీవీలు, 37 తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో అందిస్తోంది. ఆరు నుంచి 12వ తరగతి వరకు గణితం, సైన్స్ బోధనకు ఖాన్ అకాడమీ ఉచితంగా చేయూతనిస్తోంది.
1,132 పాఠశాలల్లో ఐసీటీ ల్యాబ్‌లు, 2,036 పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, 4,249 ప్రాథమిక పాఠశాలల్లో ఏఎక్స్‌ఎల్ కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (AI), డిజిటల్ లిటరసీని పాఠ్యాంశాల్లో చేర్చింది. ఒకటి నుంచి అయిదో తరగతి గణితం పాఠ్యపుస్తకాల్లో డిజిటల్ లిటరసీ అధ్యాయాన్ని, ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఏఐ, కోడింగ్, డేటా హ్యాండ్లింగ్, డిజైన్ థింకింగ్‌తో కూడిన డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్‌ను ప్రవేశపెట్టారు. ఉత్తమ విద్యా విధానాల అధ్యయనానికి ఫిన్లాండ్, జర్మనీ దేశాలకు అధ్యయన పర్యటనలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో సుమారు 500 మంది ఉపాధ్యాయులు, అధికారులు భాగస్వాములయ్యారు. 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తీర్ణత 95.15 శాతంగా నమోదైంది. 5,731 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి.
Also read: ఇకపై నా ఫోకస్ టీమిండియాపైనే..ప్రతీ మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడిస్తా