E-Paper
Advertisement

SLBC Tunnel Project: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకాలు మళ్లీ ప్రారంభం.. సుదీర్ఘ విరామం తర్వాత పనులకు అధికారుల సన్నద్ధం

SLBC Tunnel Project: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకాలు మళ్లీ ప్రారంభం.. సుదీర్ఘ విరామం తర్వాత పనులకు అధికారుల సన్నద్ధం
Advertisement

SLBC Tunnel Project: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ (SLBC) టన్నెల్ ప్రాజెక్టులో మళ్లీ కదలిక మొదలైంది. ఫిబ్రవరి నెలలో ఇన్లెట్ వద్ద జరిగిన ప్రమాదం కారణంగా.. నెలల పాటు నిలిచిపోయిన టన్నెల్ తవ్వకాలను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సుదీర్ఘ విరామం అనంతరం పనులకు ముందడుగు పడటంతో ప్రాజెక్టుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

ఈ ప్రాజెక్టులో 13.95 కిలోమీటర్ల వద్ద సొరంగం కూలిపోవడం పెద్ద సంచలనంగా మారింది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అధికారులు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా గుర్తించారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రదేశంలో ఉపరితలంపై నీటి ప్రవాహాలు అధికంగా ఉండటంతో పాటు, భూపలకల అమరిక కూడా క్లిష్టంగా ఉన్నట్లు ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేలో వెల్లడైంది. దీంతో అక్కడ మళ్లీ నేరుగా తవ్వకాలు చేపట్టడం ప్రమాదకరమని నిపుణులు స్పష్టం చేశారు.

Advertisement

ఈ నేపథ్యంలో టన్నెల్ పనులకు ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో.. ముందుకు వెళ్లాలని అధికారులు నిర్ణయించారు. టన్నెల్ నిర్మాణాల్లో అనుభవం కలిగిన భారత ఆర్మీ సీనియర్ అధికారులు హెర్పాల్ సింగ్, పరీక్షిత్ మెహర పర్యవేక్షణలో తదుపరి పనులు చేపట్టనున్నారు. వీరి మార్గదర్శకత్వంలో భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ పనులు సాగించాలని ప్రణాళిక రూపొందించారు.

ప్రమాద స్థలం వద్ద షీర్ జోన్ ఉన్నట్లు గుర్తించడంతో, ఆ ప్రాంతాన్ని పూర్తిగా నిషేధితంగా ప్రకటించి మూసివేశారు. అక్కడ ఎలాంటి పనులు చేపట్టకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు భూగర్భ నిర్మాణాలపై లోతైన అధ్యయనం చేసి ముందుకెళ్లాలని నిర్ణయించారు.

Advertisement

ప్రస్తుతం అధికారులు కొత్త మార్గం కోసం ఆలోచనలు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన 13.95 కిలోమీటర్ పాయింట్‌కు సుమారు 100 మీటర్ల వెనుక వైపు నుంచి మరో సురక్షిత మార్గం తవ్వేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ కొత్త మార్గాన్ని ప్రమాద ప్రాంతాన్ని దాటించి, ఆ తర్వాత మళ్లీ టన్నెల్ ప్రధాన ఆన్లైన్‌మెంట్‌కు కలిపే విధంగా డిజైన్ చేయాలని భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రమాదకర ప్రాంతాన్ని పూర్తిగా తప్పించుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

SLBC టన్నెల్ మొత్తం పొడవు 43.931 కిలోమీటర్లుగా ఉంది. ఇందులో ఇన్లెట్ వైపు ఇప్పటికే 13.936 కిలోమీటర్లు, ఔట్‌లెట్ వైపు 20.435 కిలోమీటర్లు తవ్వకాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఇంకా 9.533 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకాలు మిగిలి ఉన్నాయి. ఈ మిగిలిన భాగాన్ని పూర్తి చేయడమే ఇప్పుడు అధికారుల ముందు ఉన్న ప్రధాన సవాల్‌గా మారింది.

పనుల పునఃప్రారంభానికి ముందు భద్రతే ప్రధాన ప్రాధాన్యంగా అధికారులు పరిగణిస్తున్నారు. కార్మికుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా అత్యాధునిక పరికరాలు, ఆధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించారు. అలాగే నిరంతరంగా భూగర్భ పరిస్థితులను గమనించేందుకు రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయనున్నారు.

ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పాలమూరు ప్రాంతానికి సాగునీరు, త్రాగునీటి అవసరాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలగనుంది. ఎన్నో అడ్డంకులు, ప్రమాదాల మధ్య SLBC టన్నెల్ మళ్లీ ముందుకు సాగుతుండటంతో రైతులు, ప్రజలు ఆశావహంగా ఎదురుచూస్తున్నారు.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×