Tollywood:న్యూఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాలో తెలుగు సినిమాలు ఏకంగా తొమ్మిది పురస్కారాలను దక్కించుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలోనే విభిన్నమైన కంటెంట్‌తో వచ్చి మెప్పించిన ’35: చిన్న కథ కాదు’ చిత్రం ఉత్తమ బాలల చిత్రంతో పాటు ఏకంగా రెండు నేషనల్ అవార్డులను గెలుచుకోవడం విశేషం. ఈ చిత్రంలో నటించిన అరుణ్ దేవ్ పోతులకు అవార్డు లభించడంతో, అసలు టాలీవుడ్ చరిత్రలోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడిగా, నటిగా మొట్టమొదటి పురస్కారం అందుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరనే ఆసక్తికరమైన చర్చ నెటిజన్లలో మొదలైంది.
తెలుగు సినిమా చరిత్రలో రోజా రమణి తొలి బాలనటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఈ ఘనత ఆమెకే దక్కింది. 1967లో వచ్చిన పౌరాణిక చిత్రం ‘భక్త ప్రహ్లాద’లో ప్రహ్లాదుడిగా ఆమె చూపించిన అద్భుత నటనకు గాను కేంద్ర ప్రభుత్వం ఆమెను ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. ఆ రోజుల్లోనే తన పవర్‌ఫుల్ డైలాగ్స్, హావభావాలతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించి, నేషనల్ అవార్డు సాధించిన తొలి తెలుగు బాలనటిగా ఆమె రికార్డు సృష్టించారు.ఈమె ఎవరో కాదు ఒకప్పుడు పలు చిత్రాలలో నటించి , స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరో తరుణ్ తల్లి.
రోజా రమణి తర్వాత సుదీర్ఘ కాలానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మరో బాలనటుడు జాతీయ వేదికపై మెరిశాడు. ఇక 2005లో కే. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో వచ్చిన ‘బొమ్మలాట’ చిత్రంలో మాస్టర్ సాయి కుమార్ తన అద్భుత నటనతో జాతీయ ఉత్తమ బాలనటుడి అవార్డును కైవసం చేసుకున్నారు. ఇక తోలుబొమ్మలాట నేపథ్యంలో సాగే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో సైతం ఎన్నో ప్రశంసలు అందుకోవడం విశేషం.
also read:హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!
ఇక ఇటీవలి కాలంలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల విభాగంలో తెలుగు బాలనటి సుకృతి వేణి బండ్రెడ్డి తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె అయిన సుకృతి వేణి, ‘గాంధీ తాత చెట్టు’ అనే చిత్రంలో చూపించిన సహజసిద్ధమైన నటనకు గాను జాతీయ ఉత్తమ బాలనటి పురస్కారాన్ని అందుకున్నారు. ఇక తండ్రి స్టార్ డైరెక్టర్‌గా రాణిస్తుంటే, కూతురు నటిగా చిన్న వయసులోనే జాతీయ అవార్డు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ప్రస్తుతం జూలై 2026 లో తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ అవార్డుల్లో ’35 – చిన్న కథ కాదు’ చిత్రానికి గాను చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ దేవ్ పోతుల జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఒక సాదాసీదా మధ్యతరగతి నేపథ్యంలో చదువు చుట్టూ తిరిగే ఈ సినిమాలో అరుణ్ దేవ్ నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఈ చిత్రానికి ఏకంగా రెండు నేషనల్ అవార్డులు రావడం టాలీవుడ్ చిన్న చిత్రాల సత్తాను చాటిచెప్పింది.
మొత్తానికి 1967లో రోజా రమణి వేసిన పునాది నుండి నేడు 2026 లో అరుణ్ దేవ్ పోతుల వరకు తెలుగు చైల్డ్ ఆర్టిస్టులు జాతీయ స్థాయిలో తమ నటనతో మేటి అని నిరూపిస్తూనే ఉన్నారు. ఇక స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే కాకుండా, ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాల్లోని బాలనటుల ప్రతిభను గుర్తించి జాతీయ అవార్డులు అందించడం టాలీవుడ్ భవిష్యత్తుకు ఎంతో గర్వకారణం. రాబోయే రోజుల్లో మన తెలుగు బాలనటులు ఇంకా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.