Teacher Wine Shop: తెలంగాణలో ఓ ప్రభుత్వ టీచర్ కు వింత పరిస్థితి ఎదురైంది. మద్యం టెండర్ లక్కీ డ్రాలో ఆమెను అదృష్టం వరించింది. కానీ ప్రభుత్వ ఉద్యోగం పోయింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాంనగర్ బాలికల హైస్కూల్ లో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప అనే ఉపాధ్యాయురాలు ఇటీవల నిర్వహించిన మద్యం షాపుల లక్కీ డ్రాలో పాల్గొన్నారు. పుష్ప రూ.3 లక్షల డిపాజిట్ కట్టి ధర్మాపూర్ మద్యం షాపునకు అప్లై చేసుకున్నారు. అక్టోబర్ 26న తీసిన లక్కీ డ్రాలో ఆమెను అదృష్టం వరించింది. మద్యం షాపుల లక్కీ డ్రాలో ఉపాధ్యాయురాలి పేరు రావడంతో కలెక్టర్ ఆమెకు లైసెన్స్ అందించారు. టెండర్ ప్రక్రియలో పేరు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఆమె సంతోషం ఎంతో కాలం నిలవలేదు.
ప్రభుత్వ టీచర్ మద్యం టెండర్ ప్రక్రియలో పాల్గొనడంపై వ్యాపారులు, ఇతరులు అభ్యంతరం తెలిపారు. టీచర్ మద్యం షాపు ఖరారైన విషయం అధికారులకు తెలిసింది. దీంతో అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. విచారణలో పీఈటీ టీటర్ పుష్ప సెలవు పెట్టి టెండర్ ప్రక్రియలో పాల్గొన్నట్లు తెలిసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉద్యోగులు ఎలాంటి టెండర్ లేదా వ్యాపార కార్యకలాపాలలో పాల్గొనకూడదు.
ప్రభుత్వ టీచర్ కు మద్యం షాపు వచ్చిన వార్త వైరల్ అయింది. దీంతో విద్యాశాఖ అధికారులు ఆమెపై చర్యలకు దిగారు. పీఈటీ పుష్పను సస్పెన్షన్ వేటు వేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు ఉపాధ్యాయులను సస్పెండ్‌లో చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మద్యం షాపు వరించిన ఆనందం అంతలోనే ఆవిరైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.