KTR About Telangana Thalli Statue: తెలంగాణలో రాజకీయాలన్నీ ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ తిరుగుతున్నాయి. కొత్త విగ్రహాన్ని కొందరు సపోర్ట్, మరికొంత మంది విమర్శిస్తున్నారు. గతంలో ఉన్న విగ్రహం తెలంగాణ తల్లికి ప్రతీరూపం కాదని, తెలంగాణలో ఎవరూ నగలు దిగేసుకుని కనిపించరని అధికార పార్టీ తెలుపుతోంది. తాము పెట్టిందే నిజమైన తెలంగాణ తల్లికి నిదర్శనం అని చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం తల్లి తెలంగాణ తల్లికాదు, కాంగ్రెస్ తల్లి అని ప్రధాన ప్రతిపక్షపార్టీ విమర్శలు చేస్తున్నారు. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో పాడి పంటలకు గుర్తుగా మొక్కజొన్న, జొన్న కంకులతో పాటుగా.. బతుకమ్మ ఉండేదని.. ప్రస్తుతం బతుకమ్మ మాయం అయ్యిందని విమర్శిస్తున్నారు. కుడి చేతితో అభయ హస్తం ఇస్తున్నట్లుగా ఉన్న ఈ విగ్రహం ముమ్మాటికీ కాంగ్రెస్ తల్లి అవుతుంది తప్ప, తెలంగాణ తల్లికాదని విమర్శలు చేస్తున్నారు. అయితే, ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. దానికి జవాబు ఇవ్వలేక ఆయన నీళ్లు నమిలారు.
ఊహించని ప్రశ్నతో షాకైన కేటీఆర్..
తాజాగా తెలంగాణ తల్లి విగ్రహ మార్పు గురించి ఓ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న కేటీఆర్.. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లిని మార్చి.. కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ ప్రజలను అవమానిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎవడు అడిగిండు నిన్ను తల్లిని మార్చమని? ఇదివరకు ఉన్న ఆకృతి బాగాలేదని ఎవరైనా చెప్పారా? ఇవాళ కాంగ్రెస్ తల్లిని పెట్టి, మళ్లొకసారి తెలంగాణను అవమానిస్తున్నారు. భార్యను మార్చిన వాడు ఉన్నాడు. కానీ, తల్లిని మార్చిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో యాంకర్ ఓ ఫోటోను చూపించి.. “1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ నాటి ఉద్యమ నాయకులు ఈ విధంగా రూపొందించారు. తెలంగాణ మలి దశ ఉద్యమ సమయంలో మీరు ఆ విగ్రహాన్ని మార్చారు. అంటే, తొలితరం ఉద్యమకారులను అవమానించినట్లుగా భావించవచ్చా?” అనడంతో కేటీఆర్ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దేశాలు తిరిగొచ్చినోనివి నీకేం తెలుసు తెలంగాణ చరిత్ర, తెలంగాణ తల్లి..
ఇప్పుడు పెట్టిందే అసలైన విగ్రహం రా సన్నాసి#TelanganaThalliStatue #AmulBabyKTR #Telangana pic.twitter.com/EKBnfLPJzk— Aapanna Hastham (@AapannaHastham) December 10, 2024
కేటీఆర్ చరిత్ర తెలుసుకుంటే మంచిదంటున్న నెటిజన్లు
అటు ఈ వీడియోను చూసి కేటీఆర్ పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ తెలంగాణ చరిత్రను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అంటున్నారు. తాము చేసిందే మంచిది, ఎదుటి వారు చేసేది తప్పు అన్నట్లుగా కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ భావించడం వారి అహంకారానికి నిదర్శనం అని మండిపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహం కంటే.. కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన విగ్రహమే బాగుందని చాలామంది చెబుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ తల్లి విగ్రహంపై విమర్శలు మానుకొని.. గౌరవించాలని కోరుతున్నారు. మరి, ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు మారతారో లేదో చూడాలి.